సంగ్రామానికి సై | - | Sakshi
Sakshi News home page

సంగ్రామానికి సై

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

● మున్సిపాలిటీలకు నోటిఫికేషన్‌

● పరిషత్‌, పంచాయతీ పోరుకు షెడ్యూల్‌

● జిల్లా వ్యాప్తంగా అమల్లోకి ఎన్నికల కోడ్‌

సాక్షి, రాజమహేంద్రవరం: పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. మున్సిపాలిటీలకు కూడా నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. మరోవైపు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ల ఎన్నికల నోటిఫికేషన్‌ దశలవారీగా విడుదల చేయనున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. కోర్టు కేసులు, ఇతర వివాదాలు పరిష్కారమయ్యాక ప్రత్యేకంగా షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు.

13 రోజుల్లోనే మున్సిపల్‌ ఎన్నికలు

మూడు మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. 16న ఎన్నికల నోటీసు జారీ, 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న పరిశీలన, 21 వరకు ఉపసంహరణ, 28న పోలింగ్‌, అవసరమైనచోట 29న రీపోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు అనంతర ఫలితాలను ప్రకటించనున్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఒకే విడతలో

మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ) 412, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జెడ్పీటీసీ) 21కి ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ నెల 19న నోటిఫికేషన్‌ విడుదల, 21న ఎన్నికల నోటీసు జారీ, 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల పరిష్కారం, 27న ఉపసంహరణతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నవంబర్‌ 3న పోలింగ్‌, అవసరమైన చోట అదే నెల 4న రీ పోలింగ్‌, 5న ఫలితాలను ప్రకటిస్తారు.

మూడు విడతల్లో పంచాయతీ పోరు

గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతకు నవంబర్‌ 13న, రెండో విడతకు 16న, మూడో విడతకు 19న నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. మొదటి విడత ఎన్నికలు నవంబర్‌ 26న, రెండో విడత 29న, మూడో విడత డిసెంబర్‌ 2న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమైతే మరుసటి రోజు నిర్వహించి వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement