తొండంగి: బెండపూడి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తొండండి ఎస్సై జగన్మోహన్‌రావు కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం నాతవరం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి నందిక గోవిందుకు సంతోష్‌కుమార్, బుల్లిరాజు (20) ఇద్దరు కుమారులు ఉన్నారు. సంతోష్‌కుమార్ డ్రైవర్‌గా, బుల్లిరాజు తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. డ్రిల్లింగ్ మెషీన్ కొనుగోలు చేసేందుకు శుక్రవారం ఉదయం నాతవరంలో అన్నయ్య బైక్ తీసుకుని బుల్లిరాజు రాజమహేంద్రవరం బయలుదేరాడు. ఈ నేపథ్యంలో బెండపూడి జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో బుల్లిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై జగన్మోహన్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాపీమేస్త్రిగా పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉండే బుల్లిరాజు మృతితో ఆ కటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి.


