రాజానగరం: మండలంలోని దివాన్‌చెరువులో 9,430 కిలోల రేషన్ బియ్యాన్ని శుక్రవారం పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, ఎర్రబాలెం నుంచి కాకినాడ పోర్టుకు వ్యాన్‌లో ఈ బియ్యం తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు దివాన్‌చెరువులో వాహనాలను తనిఖీ చేస్తుండగా, రూ. 4,38,495 విలువ చేసే ఈ బియ్యం పట్టుబడిందని మండల పౌరసరఫరాల శాఖ అధికారి గొలుగూరి బాపిరాజు తెలిపారు. వ్యాన్ డ్రైవర్ యనమల బాలకృష్ణపై రాజానగరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.
రాష్ట్ర స్థాయి వుషు పోటీల్లో స్వర్ణ పతకం
రాజమహేంద్రవరం రూరల్: నెల్లూరులో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వుషు పోటీల్లో తిరుమల కళాశాల విద్యార్థి పఠాన్ సమీర్‌ఖాన్ సత్తా చాటాడు. 56 కిలోల విభాగంలో ప్రతిభ కనబరిచి స్వర్ణపతకం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సమీర్‌ఖాన్ విజయం వెనుక అతని కోచ్ ఎం.భవానిశంకర్ కృషి ఎంతో ఉందని పలువురు అభినందించారు. శుక్రవారం తిరుమల క్యాంపస్‌లో సమీర్‌ఖాన్‌ను తిరుమల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ యు.శ్రీహరి అభినందించారు. ఆ విద్యార్థికి ప్రోత్సాహకంగా వారి చేతుల మీదుగా రూ.10 వేల చెక్కును అందజేశారు.


