రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్‌లోని విజయవాడ– రాజమహేంద్రవరం సెక్షన్లలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ శుక్రవారం విస్తృత తనిఖీలు చేశారు. విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా, పలువురు ప్రిన్సిపల్ చీఫ్ ఆఫీసర్లతో కలసి ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమహేంద్రవరం స్టేషన్లలో అమృత్ భారత్ పథకంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు, భద్రత, స్టేషన్‌ల పరిశుభ్రతపై అధికారులతో సమీక్షించారు. ట్రాక్ నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థలు, యార్డ్ పునర్నిర్మాణ పనులు, పని ప్రదేశంలో ఉద్యోగుల భద్రత చర్యలను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే గోదావరి పుష్కరాల్లో యాత్రికుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం స్టేషన్‌లో చేపట్టనున్న ముందస్తు భద్రత చర్యలపై జీఎం అధికారులతో సమీక్షించారు. గోదావరి నదీ తీరంలోని పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, శ్రద్ధానంద్ ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమి ఘాట్లతో సహా ఇతర స్నానఘట్టాలకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వెళ్లే ప్రవేశ మార్గాలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.


