దేవరపల్లి: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అంటూ రాజకీయ డ్రామాను చంద్రబాబు ప్రభుత్వం ఆడుతుందని రాష్ట్ర అతిరాస కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీసీ సంఘం నాయకుడు ఇళ్ల భాస్కరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన గోపాలపురంలో విలేకర్లతో మాట్లాడారు. ఇది భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో బట్టబయలైందన్నారు. రాజ్యాంగపరంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటితే కోర్టులో నిలబడదని చంద్రబాబుకు ముందే తెలిసినా, కేవలం బీసీలను మభ్యపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారనేది తేలిపోయిందన్నారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు తగిలిందన్నారు. కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 34 శాతం బీసీ రిజర్వేషన్ల జీఓలను హైకోర్టు తీవ్రంగా తప్పుపడుతూ కొట్టివేసిందన్నారు. రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయిన చంద్రబాబు కనీసం బీసీ రిజర్వేషన్ల కోసం వినతిపత్రం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 34 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓలు ఇచ్చిన వెంటనే పచ్చ పార్టీ శ్రేణులు చంద్రబాబు బీసీ పక్షపాతి అంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టి క్షీరాభిషేకాలు చేసిన నాయకులు ఇప్పుడు బీసీలకు ఏం సమాధానం చెబుతారని ఇళ్ల భాస్కరరావు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను బీసీలు గమనిస్తున్నారని అన్నారు.


