విద్యుత్‌ తీగలే.. యమపాశాలై.. | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలే.. యమపాశాలై..

Oct 9 2026 12:14 AM | Updated on Oct 9 2026 12:14 AM

ఫ ఇనుప గెడంచి విద్యుత్‌ వైర్లకు తగిలి ఇద్దరి దుర్మరణం

ఫ కుటుంబ పెద్దలను కోల్పోయి,

విలపిస్తున్న బాధితులు

ఫ ఎస్‌టీబీఎల్‌ లే అవుట్‌ ప్రాంతంలో ఘటన

రాజమహేంద్రవరం రూరల్‌: ఇనుప గెడంచి పైన ఉన్న విద్యుత్‌ వైర్లుకు తగలడంతో షాక్‌కు గురై ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన రాజమహేంద్రవరం రూరల్‌ రాజవోలు గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేట మండలం చండ్రేడు గ్రామానికి చెందిన మావిరెడ్డి సూర్యారావు (54) పిల్లల చదువుల నిమిత్తం పదేళ్లుగా రాజవోలు రమాదేవి గార్డెన్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన రాజవోలులోని ఎస్‌టీబీఎల్‌ లే అవుట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కడప జిల్లా అట్లూరు మండలం లింగాలగుంట గ్రామానికి చెందిన కాకర్ల చెన్నకృష్ణారెడ్డి (58) కొద్ది సంవత్సరాలుగా రాజమహేంద్రవరం సమీపాన బొమ్మూరు నేతాజీ నగర్‌లో నివాసం ఉంటూ బిల్డింగులు నిర్మించి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎస్‌టీబీఎల్‌ లే అవుట్‌లో బిల్డింగ్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఆ లే అవుట్‌లో సీసీ కెమెరా వైర్లు బుధవారం ఉదయం తెగిపోయాయి. వాటిని కలిపేందుకు చెన్నకృష్ణారెడ్డి వాచ్‌మన్‌ సూర్యారావు సాయం కోరారు. ఈ క్రమంలో ఇద్దరూ ఇనుప గెడంచిని సీసీ కెమెరా ఉన్న ప్రాంతానికి తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పైన అతి తక్కువ ఎత్తులో ఉన్న వ్యవసాయ విద్యుత్‌ వైర్లు ఆ గెడంచికి తగిలాయి. దీంతో, ఇద్దరూ ఒక్కసారిగా తీవ్ర విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని రాజమహేంద్రవరం ఽసౌత్‌ జోన్‌ డీఎస్పీ శివప్రియ, ధవళేశ్వరం ఇన్‌స్పెక్టర్‌ టి.గణేష్‌, ఎస్సై, సిబ్బంది చేరుకుని, మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతుల బంధువుల ఆందోళన

ఎస్‌టీబీఎల్‌ లే అవుట్‌ యజమానుల నిర్లక్ష్యం కారణంగానే సూర్యారావు, చెన్నకృష్ణారెడ్డి దుర్మరణం పాలయ్యారని ఆరోపిస్తూ వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ విద్యుత్‌ వైర్లు చేతికందే ఎత్తులోనే ఉన్నప్పటికీ ఎస్‌టీబీఎల్‌ లే అవుట్‌ యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని చెప్పారు. లే అవుట్‌ ప్రారంభానికి ముందే ఆ వైర్లను అక్కడి నుంచి మార్చి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ వైస్‌ ఎంపీపీ నక్కా రాజబాబు అండగా నిలిచారు. లే అవుట్‌ యాజమాన్యంతో చర్చించి, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఎస్‌టీబీఎల్‌ లే అవుట్‌ యాజమాన్యం అంగీకరించింది. సంబంధిత చెక్కులను శుక్రవారం అందజేస్తామని తెలిపింది.

పిల్లల చదువుల కోసం స్వగ్రామం వదిలి..

మరో మృతుడు సూర్యారావు డిగ్రీ వరకూ చదువుకున్నారు. ఆయనకు భార్య కృష్ణకుమారి, తల్లి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహం చేశారు. రెండో కుమార్తె ఉద్యోగం చేస్తూండగా, మూడో కుమార్తె బీటెక్‌ చదువుతోంది. పిల్లల చదువు కోసం పదేళ్ల క్రితమే సూర్యారావు రంగంపేట చండ్రేడు నుంచి రాజవోలు వచ్చేసింది. లే అవుట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్న ఆయన మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సూర్యారావు మృతదేహంపై పడి భార్య కృష్ణకుమారి, కుమార్తెలు గుండెవిలసిలా రోదించారు. ‘నాన్నా నాన్నా లే’ అంటూ కుమార్తెలు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

లే మావయ్యా.. లే..

ఈ ప్రమాద మృతుడు చెన్నకృష్ణారెడ్డికి భార్య వెంకట సుబ్బాయమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. ఆయన కుటుంబం కొద్ది సంవత్సరాల క్రితం కడప జిల్లా నుంచి బొమ్మూరు వచ్చింది. బిల్డర్‌గా పరిసర ప్రాంతాల ప్రజలకు చెన్నకృష్ణారెడ్డి సుపరిచితులు. ఆయన మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో బిల్డర్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ‘మావయ్యా.. లే.. మావయ్యా.. పిల్లలను స్కూలుకు ఎవరు తీసుకువెళ్లారు?’ అంటూ కృష్ణారెడ్డి భార్య వెంకట సుబ్బమ్మ రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆయన మృతదేహం వద్ద కుమార్తె, కుమారులు, మనవరాళ్లు గద్గద స్వరంతో రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement