రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ప్రజాపరిషత్ ఇన్‌చార్జి ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా డ్వామా పరిపాలనాధికారి కె.కిశోర్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హుకుంపేటలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయనకు రూరల్ ఎంపీడీవో సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, పరిపాలనాధికారి ఆకెళ్ల వరప్రసాద్, జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ ప్రకాష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. .
మద్యం షాపులకు లాటరీ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): 2026–27 సంవత్సరానికి కొవ్వూరు రూరల్, మండపేట రూరల్, బిక్కవోలు, కడియం మండలాల్లో నాలుగు మద్యంషాపుల లైసెన్సుల మంజూరుకు గురువారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో లాటరీ తీశారు. సబ్ కలెక్టర్ శుభం నోఖ్వాల్ చేతుల మీదుగా లైసెన్సు దారులను ఎంపిక చేశారు. ఈ నాలుగింటో రెండు షాపులను మహిళలు దక్కించుకున్నారు. ఈ షాపులకు తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుము ఒక్కో షాపునకు రూ.23 లక్షలుగా నిర్ణయించగా, వార్షిక ఆర్‌ఈటీ బిక్కవోలు, కడియం షాపులకు రూ.2.71 కోట్లు, కొవ్వూరు, మండపేట రూరల్ షాపులకు రూ.71.50 లక్షలుగా నిర్ణయించారు. పర్మిట్ రూమ్ ఆర్‌ఈటీ బిక్కవోలు, మండపేట రూరల్ షాపులకు రూ.7.50 లక్షలు, కడియం, కొవ్వూరు షాపులకు రూ.27.50 లక్షలుగా నిర్ణయించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వై.శ్రీలత మాట్లాడుతూ లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామన్నారు.
పిల్లలను పనిలో
పెట్టుకుంటే కఠిన చర్యలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఇటుక బట్టీల యజమానులు, కాంట్రాక్టర్లు, కార్మికుల సరఫరాదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ 18 ఏళ్లలోపు వారిని పనిలో పెట్టుకోరాదని, దీనిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కార్మిక శాఖ జోన్–2 జాయింట్ కమిషనర్ ఎ.గణేష్ హెచ్చరించారు. జిల్లాలోని పలు ఇటుక బట్టీలను ఆయన గురువారం పరిశీలించారు. ఇటుక బట్టీలకు సంబంధించిన పనుల్లో 18 ఏళ్ల లోపు బాల కార్మికులతో పనులు చేయించడం చట్టవిరుద్ధమన్నారు. ఇటుకల తయారీ, మట్టి తయారీ, ఇతర రాష్ట్రాల కార్మికులతో పని చేయించుకునే యజమానులు తప్పనిసరిగా ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ చట్టం ప్రకారం లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల కార్మికులను పనుల్లో నియమిస్తే చట్ట ప్రకారం కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ జరిమానా విధిస్తారని ఆయన చెప్పారు. పెద్ద మొత్తంలో డబ్బులు అడ్వాన్సుగా ఇవ్వడంతో పాటు ఇతర రాష్ట్రాల కార్మికులను పనిలో పెట్టుకోవడం, నిర్బంధంగా పని చేయించడం నేరమన్నారు. ఇది వెట్టిచాకిరీ కిందకు వస్తుందన్నారు. ఇటుక బట్టీల్లో వలస కార్మికులు, వారి కుటుంబాలు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నందున వారి పిల్లలు కూడా ఈ పనిలో నిమగ్నమయ్యే అవకాశముందని, దీనిని పూర్తిగా నివారించాల్సిన బాధ్యత బట్టీల యజమానులు, కాంట్రాక్టర్లపై ఉందని గణేష్ స్పష్టం చేశారు.


