ఫ టిప్పర్ ఢీకొని తల్లి, కొడుకు దుర్మరణం
ఫ కంసాలిపాలెం – రావిమెట్ల రోడ్డులో ప్రమాదం
నిడదవోలు రూరల్: ఆ కుటుంబంలో ఒకేసారి రెండు దీపాలు ఆరిపోయాయి. బీటెక్ పూర్తి చేసిన కన్న కొడుకు.. మంచి ఉద్యోగం తెచ్చుకుని కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న తరుణంలో ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. బంధువులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆ తల్లీకొడుకులను మృత్యువు టిప్పర్ రూపంలో కబళించింది. వివరాలివీ.. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉన్న తమ బంధువులను పరామర్శించడానికి.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన పాకలపాటి లక్ష్మి (40), ఆమె కుమారుడు చంద్రశేఖర్ (21) గురువారం బైక్‌పై బయల్దేరారు. నిడదవోలు మండలం కంసాలిపాలెం – రావిమెట్ల గ్రామాల మధ్య వారి బైక్‌ను వెనుక నుంచి వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. బైక్ మీద నుంచి రోడ్డుపై పడిపోయిన తల్లీకొడుకులిద్దరి పైనుంచి టిప్పర్ వెనుక చక్రాలు దూసుకెళ్లాయి. దీంతో, తీవ్ర రక్తస్రావమై లక్ష్మి, చంద్రశేఖర్ ఘటనా స్థలంలోని దుర్మరణం పాలయ్యారు. మృతుడు చంద్రశేఖర్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఆశతో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంతలోనే ఇలా రోడ్డు ప్రమాదంలో తల్లితో సహా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే లక్ష్మి భర్త జలాచంద్రరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒకేసారి భార్యను, కొడుకును కోల్పోవడంతో ఆ దుఃఖాన్ని తాళలేక ఆయన పెద్ద పెట్టున రోదించడం అక్కడి వారిని కలచివేసింది. ఘటనా స్థలాన్ని సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు పరిశీలించారు. మృతురాలి భర్త జలాచంద్రరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలంలో రోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్న తల్లీకొడుకులను చూసి స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ వాహనాలతో ప్రమాదాలు
నిడదవోలు వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులు సుదీర్ఘ కాలంగా సాగుతున్నాయి. దీంతో, తాడేపల్లిగూడెం వైపు ప్రధాన రహదారిపై వెళ్లాల్సిన భారీ టిప్పర్లు, వాహనాలను కంసాలిపాలెం వంతెన మీదుగా మళ్లించారు. ఈ మార్గంలో నిత్యం వందలాది భారీ వాహనాలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్నాయి. దీంతో, ఈ రోడ్డు పూర్తిగా గోతులమయమైంది. వాహనదారులు ఆ గుంతలను తప్పించబోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు అధ్వానంగా మారడం, టిప్పర్ల వేగం మితిమీరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో నిత్యం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


