చిక్కకుండా.. తప్పించుకుంటూ.. | - | Sakshi
Sakshi News home page

చిక్కకుండా.. తప్పించుకుంటూ..

Oct 9 2026 12:14 AM | Updated on Oct 9 2026 12:14 AM

దేవరపల్లి/చాగల్లు: గోదావరిని దాటి వచ్చిన పులి రెండు రోజులుగా తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి, చాగల్లు మండలాల్లో తిరుగుతూ ప్రజలను కంగారెత్తిస్తోంది. గురువారం రాత్రి దేవరపల్లి మండలం లక్ష్మీపురం, చాగల్లు మండలం చిక్కాల గ్రామాల మధ్య ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అక్కడ నుంచి నిడదవోలు మండలం తాడిమళ్ల, నిడదవోలు, దేవరపల్లి మండలం యర్నగూడెం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా.. గోదావరి దాటి బుధవారం తాళ్లపూడి మండలం గజ్జరం, తుపాకులగూడెం, పోచవరం, ఎలుగు కొండ గోపాలపురం మండలం భీమోలు, గోపవరం ప్రాంతాల్లోకి పులి ప్రవేశించింది. అక్కడి నుంచి దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి మేరీమాత ఆలయం వెనుక వైపున గల క్వారీల ప్రాంతానికి గురువారం చేరుకుంది. అనంతరం క్వారీ ప్రాంతం నుంచి అధికారులకు చిక్కకుండా నెమ్మదిగా జారుకుని రాత్రికి లక్ష్మీపురం – చిక్కాల గ్రామాల మధ్యలో సంచరిస్తోంది.

అధికారుల గాలింపు

జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్‌, రేంజ్‌ అధికారి దావీదు, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌, అటవీ శాఖ బృందాలు, సుమారు 30 మంది సిబ్బంది పెద్దపులి కదలికలను గమనిస్తున్నారు. క్వారీలో ఉన్నప్పుడు పట్టుకునేందుకు బోను, ట్రాప్‌ కెమెరాలు, డ్రోన్‌ ఏర్పాటు చేశారు. కార్మికులను క్వారీల్లో పనులకు వెళ్లకుండా నిలుపుదల చేశారు. సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అప్రమత్తంగా ఉండాలి

చాగల్లు తహసీల్దార్‌ జె.మేరికమ్మ మాట్లాడుతూ పులి సంచారం నేపథ్యంలో రైతులు, పశువుల కాపరులు, పొలాల వద్దకు వెళ్లే కూలీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులు ప్రస్తుతానికి పంట పొలాల్లోకి వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఒంటరిగా బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. పశువులను సురక్షితమైన ప్రదేశాల్లో, పాకల వద్ద జాగ్రత్తగా కట్టి వేయాలని కోరారు. ప్రజలు ఆందోళన చెందకుండా అధికారుల సూచనలు పాటించాలని, పులికి సంబంధించిన ఆధారాలు లేదా అనవాళ్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

దేవరపల్లి మండలం గౌరీపట్నం

క్వారీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోను

గౌరీపట్నం క్వారీ ప్రాంతంలో

పులి ఆచూకీ కోసం డ్రోన్‌తో గాలింపు

ఫ అధికారులను పరుగులు పెట్టిస్తున్న పులి

ఫ గురువారం రాత్రికి లక్ష్మీపురం

– చిక్కాల మధ్య సంచారం

ఫ ప్రజలు అప్రమత్తంగా

ఉండాలని అధికారుల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement