శాంతిభద్రతలు పూజ్యం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలు పూజ్యం

Sep 12 2026 12:24 AM | Updated on Sep 12 2026 12:24 AM

సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం సిటీ/సీటీఆర్‌ఐ: రెడ్‌బుక్‌ రాజ్యంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఉన్నతాధికారులు, మేధావులు ధ్వజమెత్తారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో క్షీణించిన శాంతిభద్రతలపై వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌, మాజీ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలో శుక్రవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారులు, మేధావులు తరలివచ్చి తమ అభిప్రాయాలు తెలియజేశారు.

విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేసి, దహనం చేసిన సంఘటన.. కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్‌ భరించలేక చనిపోతున్నానంటూ మాదిగ యువకుడు పురుపోగు క్రాంతికుమార్‌ సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పిన ఉదంతం.. రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొని చంపడం.. పిఠాపురం పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడటం వంటి దారుణ ఘటనలు రాష్ట్రంలో నిత్యం జరుగుతున్నాయన్నారు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ కూటమి నాయకుల చేతిలోకి చేరడంతో పోలీసులు వారికి తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, దేశిరెడ్డి బలరామనాయుడు, వీఎస్‌ఎస్‌ కృష్ణకుమార్‌, రిటైర్డ్‌ సీఐ సాల్మన్‌రాజు, కల్తీ పాల ఘటన బాధిత కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, వాసంశెట్టి గంగాధరరావు, తోట రామకృష్ణ, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ కానుబోయిన సాగర్‌, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తగరం సోము, సంయుక్త కార్యదర్శి ఆరే చిన్ని, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీ దాసి వెంకటరావు, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొండబాబు, దూర్వాసుల సత్యనారాయణ, నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, పెంకే సురేష్‌, యువజన విభాగం నగర కన్వీనర్‌ బిల్డర్‌ చిన్నా, మాజీ కార్పొరేటర్‌ నల్లా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఫ చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు

ఫ పాలకులే గంజాయి, మద్యం, మతం మత్తు వ్యాప్తి చేస్తున్నారు

ఫ బాధితుల పైనే కేసులు పెట్టిస్తున్నారు

ఫ ఒక్క ఘటనలోనూ బాధితులకు న్యాయం జరగడం లేదు

ఫ పాలకుల అసమర్థతతో నేరస్తులు చెలరేగిపోతున్నారు

ఫ ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న వారే ప్రస్తుత సీఎంలు

ఫ కూటమి సర్కారుపై అఖిల పక్ష నాయకులు, మేధావుల మండిపాటు

దిగజారిపోయిన ప్రభుత్వమిది

ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సీఎంలయ్యారు. చట్టం సమానంగా వర్తిస్తే వారికి ఆ పదవులెలా వస్తాయి? ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతామని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులే దానిని ఉల్లంఘించి, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ పాలన సాగించడం దారుణం. ప్రియాంక ఘటన, అంజలి మర్డర్‌, ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలి నిర్లక్ష్యంతో జయంతి మృతి, కల్తీపాల ఘటన బాధితులకు జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు, ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజీలు ఇవ్వాలని ప్రియాంక తండ్రి వెంకటేష్‌ పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. దీనిపై హైకోర్టులో కేసు వేశాం, అక్కడ కచ్చితంగా ఫుటేజీలు ఇవ్వడానికి పోలీసులు రెడీగా ఉండాలి. మద్యం, గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఆ మత్తులో మహిళలు, చిన్నారులు, యువతులపై దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. చివరికి దేశద్రోహం, ఉపా చట్టం కింద కేసులు కూడా పెడుతున్నారంటే ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ప్రజలు ఆలోచించాలి. సీసీ టీవీలు లేనప్పుడు పోలీసు వ్యవస్థ పని చేయలేదా? నేరస్తులను అరెస్టు చేయలేదా? ఏ ఒక్క బాధిత కుటుంబానికీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. కనీసం ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

– మార్గాని భరత్‌రామ్‌,

మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి

మహిళలకు రక్షణ కరువు

గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మహిళల రక్షణ కోసం దిశ బిల్లు తీసుకొచ్చారు. అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారంలోకి రాగానే దిశ బిల్లును, మహిళా పోలీసు స్టేషన్లను తొలగించేశారు. అప్పటి నుంచీ రక్షణ కరువై, మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, పోలీసులు త్వరలోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

– మేడపాటి షర్మిలారెడ్డి,

రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌

ప్రజల మానప్రాణాలకు రక్షణ లేదు

వ్యవస్థలను మేనేజ్‌ చేసే నాయకుల వల్ల ప్రజలకు న్యాయం జరగదు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దళితులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. జరిగిన సంఘటనలను వ్యవస్థల సాయంతో వక్రీకరించి ప్రజలను ఏమార్చుతున్నారు. అధికారంలో ఉండి ఇష్టానుసారం చేయొచ్చన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ లేదని చెప్పడం సరికాదు. శాంతిభద్రతల విషయంలో పోలీసులతో పాటు సీఎం చంద్రబాబు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆయన మాటలన్నీ అబద్ధాలే. వ్యక్తి గొప్ప కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత బాధ్యత మరచిపోవడం వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి.

– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement