పెరవలి: కంద రైతులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లాభాల బాట పడితే నేటి కూటమి ప్రభుత్వంలో కనీస గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పుట్టు కంద ధర రూ.3,800 పలకడంతో దిగుబడి బట్టి ఎకరానికి రూ.2.05 లక్షల నుంచి రూ.2.45 లక్షలు నష్టపోవలసి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పుట్టు కంద ధర రూ.11 వేలు ఉండగా నేడు అదే రూ.3800కి పడిపోయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా దిగుబడి తగ్గటంతో పాటు ధరలు పతనం కావడంతో పెట్టుబడి కూడ రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుండి 60 పుట్టులు దిగుబడి రావడంతో రైతులు నష్టాలు పాలై ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఎకరం కంద చేను తవ్వితే 50 నుంచి 60 పుట్టులు దిగుబడి వస్తోందని, దీని వల్ల రైతులకు ఎకరానికి రూ.2.05 లక్షల నుంచి రూ.2.45 లక్షల వరకు నష్టం రావడంతో రైతులు అల్లాడుతున్నారు.
జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా..
కంద పంట గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో సాగవుతోంది. డివిజన్‌లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, అనపర్తి గోపాలపురం, దేవరపల్లి, కడియం, రాజానగరం మండలాల్లో 1450 హెక్టార్లలో సాగు చేస్తున్నారు.
లాభాల నుంచి నష్టాలకు
కంద సాగు చేసినప్పుడు పుట్టు విత్తనం కంద రూ.8 వేలకు కోనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్‌లో పుట్టు ధర రూ.3,800 ఉండటం, దానికి తోడు దిగుబడి తగ్గడంతో రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుత మార్కెట్టులో లభిస్తున్న ధర ప్రకారం 50 పుట్లకు రూ.1.9 లక్షలు, 60 పుట్లకు రూ.2.28 లక్షలు వస్తుంటే ఖర్చు రూ.4.35 లక్షలు ఒక ఎకరానికి అయ్యిందని దీనితో దిగుబడి బట్టి ఎకరానికి రూ.2.05 లక్షల నుంచి రూ.2.45 లక్షలు నష్టపోవలసి వస్తోంది.
పెట్టుబడి
ఎకరం కంద పంట వేయాలంటే 30 పుట్టుల విత్తనం వేయాలని అందుకు గత ఏడాది విత్తనం ధర పుట్టు రూ.8 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.2.4 లక్షలు, దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి కూలీలకు రూ.లక్ష అవుతోందని, పెంట వేయటానికి రూ.30 వేలు, ఎరువులు పురుగుమందులకు రూ.40 వేలు, నీటి తడులు, కలుపు తీతకు రూ.25 వేలు అవుతుందని మొత్తం ఖర్చు రూ.4.35 లక్షలు అవుతోంది.
ధరలు ఇలా
కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది పుట్టు (232 కిలోలు) రూ.6 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.3,800 వద్ద స్థిరంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో పుట్ట ధర రూ.7 వేలు ఉండగా నేడు రూ.3800 వేలుకు పడిపోవటంతో అయోమయంలో ఉన్నారు.
సగానికి సగం పడిపోయిన ధరలు
మార్కెట్‌లో పుట్టు ధర రూ.3,800
గత ప్రభుత్వంలో రూ.11 వేలు ఉండగా
గత ఏడాది రూ.7 వేలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
అప్పు ఎలా తీర్చాలో..
మూడు ఎకరాలలో కంద పంట వేశాను. గత నష్టాలను పూడ్చుకుందామనుకుంటే ఈ ఏడాది మరింత ధర తగ్గిపోయింది. దీనితో మూడు ఎకరాలకు సుమారుగా రూ.6 లక్షలు నష్టపోయాను. అప్పు ఎలా తీర్చాలో తెలియటం లేదు.
– బొలిశెట్టి శ్రీనివాస్, రైతు, మల్లేశ్వరం
ధర లేక నష్టపోతున్నాం
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవటంతో నేడు నష్టాలు పాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.లక్షపైనే మిగులు వస్తోందనుకుంటే నేడు ఒక ఎకరానికి రూ.2.45 లక్షలు నష్టపోయాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పుట్టు కంద ధర రూ.11 వేలు పలికితే నేడు రూ.5 వేలు పలుకుతోంది.
– రాయుడు లీలా బాబు, రైతు, ఖండవల్లి


