ఎటపాక: తమ ప్రభుత్వంలో రోడ్లు బాగు చేశామంటూ అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడేమో కూటమి నేతలే రోడ్డెక్కడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతం పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని ఎటపాక నుంచి కన్నాయిగూడెం వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలో తెలంగాణ ప్రాంతం నుంచి ఇసుక లారీలు వెళ్తుడడంతో ఆంధ్రా పరిధిలోని రహదారి అధ్వానంగా తయారైంది. ఈ రహదారికి కనీసం మరమ్మతులు చేయించకపోవటంతో విసిగిపోయిన అధికార పార్టీ నేతలే రోడ్డెక్కటం గమనార్హం. అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, ఫలితం లేదని బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎటపాక ప్రధాన రహదారిపై బైటాయించి ఇసుక లారీలను అడ్డుకున్నారు. లారీల కారణంగా గోతులు పడడంతో కనీసం ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శించారు. చివరికి టీడీపీ నేతలే టిప్పర్లతో రాళ్లు తెచ్చి గోతుల్లో పోసి కొద్దిపాటి మరమ్మతులు చేసుకున్నారు. కాగా సమస్యపై చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్ స్పందించారని, ఈ రహదారి పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పినట్లు కూటమి నేతలు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, కూటమి నేతలు మువ్వా శ్రీనివాసరావు, మారాసు గంగాధర్, మూడే సతీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రహదారి బాగుచేయాలంటూ ఆందోళన


