గండేపల్లి: అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. కన్న కొడుకుల మానసిక పరిస్థితిని, భర్త మృతిని తలుచుకుంటూ భోరున విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వివరాల్లోకి వెళితే.. మండలం తాళ్లూరుకు చెందిన మలిరెడ్డి రామచంద్రరావు (50) తాపిమేస్త్రి. ఈనెల 7న ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెదకినా ప్రయోజనం లేకపోవడంతో 14వ తేదీన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక హైవేను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల 15వ తేదీన స్థానిక గొర్రెల కాపరికి అతని మృతదేహం కనపడింది. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని జెడ్ రాగంపేట సీహెచ్‌సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతునికి భార్య సూర్యకుమారి ఉండగా, పెద్ద కొడుకు దుర్గాప్రసాద్ మానసిక దివ్యాంగుడని, పదో తరగతి చెదువుతున్న చిన్న కొడుకు నవీన్ ఫిట్స్‌తో బాధపడుతుంటాడని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ మృతికి కారణమైన వ్యక్తికి ఆరు నెలల జైలు
హనుమాన్ జంక్షన్ రూరల్: 16వ నంబర్ జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా కారు నడుపుతూ రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి నూజివీడు కోర్టులో ఆరు నెలల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే 2022లో తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన గొడవర్తి శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తూ బాపులపాడు మండలం వీరవల్లి వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అతని తల్లి లక్ష్మి వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందగా, భార్య కీర్తన, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అప్పటి వీరవల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం విచారణ పూర్తి చేసి కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా, నూజివీడులోని జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏపీపీ ప్రసన్న వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శివ పార్వతి తీర్పు వెలువరించారు. ఈ కేసులో ముద్దాయి శ్రీనివాసరావుకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని వీరవల్లి ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంపై కేసు
చాగల్లు: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొవ్వూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు వివరాల ప్రకారం.. తణుకు మండలం ముద్దాపురానికి చెందిన బొల్లా శ్రీరామకృష్ణ కె.సావరంలోని కోస్టల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పని ముగించుకుని తన భార్య ఉమాదేవితో కలసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల సమయంలో విజ్జేశ్వరం డౌన్‌లోని ఆర్‌ఆర్ భోజన హోటల్ వద్దకు చేరుకునే సరికి, ఎదురుగా అతివేగంగా వచ్చిన వ్యాన్ వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కుడిచేయి చిటికెన వేలు విరగడంతో పాటు, ఒంటిపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అలాగే భార్య ఉమాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రులను రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బొల్లా ఉమాదేవి ఫిర్యాదుతో కొవ్వూరు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● అనుమానాస్పద స్థితిలో మృతి
● ఆదరణ కోల్పోయిన కుటుంబం


