ప్రతిభకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు ప్రోత్సాహం

Sep 17 2026 12:26 AM | Updated on Sep 17 2026 12:26 AM

ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌లకు

దరఖాస్తుల ఆహ్వానం

ఆన్‌లైన్‌లో స్వీకరణ

దరఖాస్తులకు అక్టోబరు 12..

పరీక్ష ఫీజుకు 13వ తేదీ తుది గడువు

రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి, వారికి ఉపకార వేతనాలు అందించే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పథకం 2026–27 సంవత్సరానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు అందించే ఈ పథకానికి ఏటేటా ఆదరణ పెరుగుతోంది. గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 478 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 2008–09 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించిన ఈ పథకం కింద ఏటా నవంబర్‌లో పరీక్షలు నిర్వహించి ఎంపికై న విద్యార్థులకు నాలుగేళ్ల పాటు రూ.12 వేల చొప్పున ప్రోత్సాహకాలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తారు. గతేడాది నిర్వహించిన పరీక్షలో కాకినాడ జిల్లా నుంచి 187, కోనసీమ జిల్లా నుంచి 141, తూర్పుగోదావరి జిల్లా నుంచి 150 మంది ఎంపికయ్యారు.

విధి విధానాలివీ..

ఏడో తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా ఈ పరీక్షకు అర్హత కల్పిస్తారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఏడవ తరగతిలో 50 శాతం, మిగిలిన తరగతులకు చెందిన వారు 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

బీసీ, ఓసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది.

ప్రవేశ పరీక్ష 150 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు.

జిల్లా ప్రాతిపదికగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి రూ.3.5 లక్షలకు మించి ఉండకూడదు.

విద్యార్థికి ఆధార్‌ లేదా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరు ఉండాలి.

అక్టోబరు 12 ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు తుది గడువు.

పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు అక్టోబరు 13

పరీక్ష రుసుం ఆన్‌లైన్‌ దరఖాస్తులోని ఎస్‌బీఐ కలెక్ట్‌ లింక్‌ ద్వారా మాత్రమే చెల్లించాలి.

పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌, లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంది.

విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి

ప్రతి పాఠశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా డీఈవో, డీవైఈవో, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పర్యవేక్షించాల్సి ఉంది. విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగేందుకు ఈ ప్రవేశ పరీక్ష ఉపకరిస్తుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చక్కని అవకాశం.

– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement