అప్పలరాజుపేట పరిసరాల్లో హై అలర్ట్
రాజవొమ్మంగి: కొన్ని నెలలుగా ఏజెన్సీలో సంచరిస్తున్న పెద్ద పులి ప్రస్తుతం రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేటలోని వట్టిగెడ్డ రిజర్వాయర్ వద్దకు వచ్చినట్లు అటవీ అధికారులు గురువారం ప్రకటించారు. ఈ మేరకు మెగా ఫోన్‌తో స్థానికులను అప్రమత్తం చేశారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు స్పష్టంగా తెలుసుకున్న రాజవొమ్మంగి ఫారెస్టు రేంజి అధికారి (ఎఫ్‌ఆర్‌ఓ) ఉషారాణి తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి ట్రాకర్ ద్వారా పులి ఎక్కడ ఉందో మరోసారి పరిశీలించారు. అనంతరం అప్పలరాజుపేట గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పశువులను మేత కోసం అడవి వైపు విడిచి పెట్టవద్దని కోరారు. అలాగే ఒంటరిగా సంచరించవద్దని, పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొండపోడు భూములకు వెళ్లే వారు తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ అడవిలోకి వెళ్లరాదని సూచించారు. ఇదిలా ఉండగా గురువారం అడవికి వెళ్లిన గిరిజన మహిళ కేదారి సత్యవతి తనకు చాలా దగ్గరలో పులి గాండ్రింపు వినిపించిందని, దీంతో వడివడిగా ఇంటికి చేరానని ‘సాక్షి’కి తెలిపింది. పులి సంచారంపై ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. ఎఫ్‌ఎస్‌ఓ భవాని, ఎఫ్‌బీఓ సూర్యప్రసాద్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.


