కోతల షాక్‌ | - | Sakshi
Sakshi News home page

కోతల షాక్‌

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

సాక్షి, రాజమహేంద్రవరం/పెరవలి/నిడదవోలు రూరల్‌/కపిలేశ్వరపురం: వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబు సర్కార్‌ జనానికి విద్యుత్‌ కోతల షాక్‌ ఇస్తోంది. సమయం సందర్భం లేని కరెంటు కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య రోజూ రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికీ కోతలు విధిస్తున్నారు. గతంలో వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేవారు. దీనిని చంద్రబాబు సర్కారు ప్రస్తుతం 7 గంటలకు తగ్గించేయడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండల వేడికి తోడు కరెంటు కోతలతో ఆక్వా రంగం పైనా ప్రభావం పడుతోంది.

ఈఎల్‌ఆర్‌ పేరిట..

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) అమలు చేస్తున్నారు. ఫలితంగా పల్లెలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. పగలంతా వేసవిని తలపించే ఎండతో అవస్థలు పడుతున్న చిన్న పిల్లలు, వృద్ధులు.. రాత్రి వేళ కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్కపోత, దోమల మోతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు విద్యార్థులకు సైతం చదువుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. విజయవాడలోని విద్యుత్‌ సౌధ అధికారుల ఆదేశాల మేరకే ఈఎల్‌ఆర్‌ అమలు చేస్తున్నామని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు.

● నిడదవోలు రూరల్‌ మండలంలోని చాలా పల్లెల్లో రోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు.

● కపిలేశ్వరపురం మండలంలో రోజూ కనీసం ఒక గంటపాటు ఈఎల్‌ఆర్‌ అమలు చేస్తున్నారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి మధ్య కీలక సమయంలో కరెంట్‌ పోతూండటంతో స్థానికులు అల్లాడిపోతున్నారు.

● తాళ్లపూడి మండలంలో మంగళవారం రాత్రి 10 నుంచి 11.30 గంటల వరకూ కరెంట్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో, చిమ్మచీకట్లో దోమలతో సావాసం చేయాల్సి వచ్చిందని స్థానికులు వాపోయారు. ఒక్కో రోజు ఒక్కో సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● తమ గ్రామాల్లో రోజూ రెండు గంటలపాటు ఈఎల్‌ఆర్‌ అమలు చేస్తున్నారని రాయవరం మండల ప్రజలు చెబుతున్నారు.

● సీతానగరం మండలంలోని అనే గ్రామాల్లో సైతం రోజూ ఓ గంట పాటు అంధకారం రాజ్యమేలుతోంది.

● పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల మధ్య విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు.

పెరవలి మండలం అన్నవరప్పాడులో అలముకున్న అంధకారం

ఎడాపెడా విద్యుత్‌ సరఫరా నిలిపివేత

సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్యలో 2 గంటల పవర్‌ కట్‌

జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో అంధకారం

కీలక సమయంలో

కరెంట్‌ లేక ఇబ్బందులు

దోమల దండుతో జనానికి నరకయాతన

అల్లాడిపోతున్నాం

కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో సుమారు గంట నుంచి రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు. ఒకవైపు ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతూంటే ప్రభుత్వం కరెంటు కోతలతో మరింతగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా దళిత వాడల్లో ఎవ్వరికీ ఇన్వర్టర్లు లేక దోమలతో సావాసం చేయాల్సి వస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులు నరకయాతన పడుతున్నారు.

– పలివెల మధు, అచ్చుతాపురం,

కపిలేశ్వరపురం మండలం

నరకయాతన

వేళాపాళా లేని విద్యుత్‌ కోతలతో నరకయాతన అనుభవిస్తున్నాం. కొద్ది రోజులుగా రాత్రి వేళ కనీసం రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారు. పగలు ఎండ వేడి, రాత్రి ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. విద్యుత్‌ కోతలు లేకుండా చూస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది.

– పల్లాటి రవి, ఖండవల్లి, పెరవలి మండలం

రాత్రి వేళ కోతలు ఆపాలి

వేసవిని తలపిస్తున్న ఎండలతో పగలంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. రాత్రి వేళ ఉక్కపోతతో అల్లాడిపోతున్నాం. ఇలాంటి సమయంలో పవర్‌ కట్‌లతో నరకం చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రాత్రి వేళల్లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అవసరమైతే విద్యుత్‌ కొనుగోలు చేసి, సరఫరా చేయాలి.

– బి.సురేష్‌, తాళ్లపాలెం, నిడదవోలు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement