మోకాళ్లపై నిలబడి నిరసన | - | Sakshi
Sakshi News home page

మోకాళ్లపై నిలబడి నిరసన

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

నిడదవోలు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో ఉండ్రాజవరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) మోకాళ్లపై నిలబడి గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు పదోన్నతులు కల్పించాలని, జీతభత్యాలు పెంచాలని, నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలని పెద్ద పెట్టున నినదించారు. అనంతరం, తహసీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం మండల శాఖ అధ్యక్షుడు తణుకు శంకరం మాట్లాడుతూ, తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. వీఆర్‌ఏల నిరసనకు వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం మండల ప్రధాన కార్యదర్శి తీపర్తి నాగాంజనేయులు, కార్యదర్శి కె.రమేష్‌, నాయకులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా

తుది ప్రచురణకు పక్కా ఏర్పాట్లు

రాజమహేంద్రవరం సిటీ: ఓటర్ల జాబితా తుది ప్రచురణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ కీర్తి చేకూరి అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌), క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న కలెక్టర్‌ కీర్తి మాట్లాడుతూ, జిల్లాలో 86,959 మంది ఓటర్లకు నోటీసులు అందించగా.. ఇందులో 86,250 మందికి సంబంధించిన విచారణలు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 709 కేసులు మాత్రమే విచారణకు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 81,735 మంది వివరాలను తుది ప్రచురణకు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో మొత్తం 15,78,753 ఓటర్ల వివరాలు పరిశీలించగా, 13,84,978 వివరాలు తుది ప్రచురణకు సిద్ధం చేశామని తెలిపారు. పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఓటరుకూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి డీఆర్‌ఓ ఎస్‌.భాస్కర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

పింఛన్లకు 52,574 దరఖాస్తులు

నేటితో ముగియనున్న గడువు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకంలో భాగంగా కొత్త పింఛన్ల కోసం జిల్లాలో ఇప్పటి వరకూ 52,574 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియనుందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు తదితరులందరూ తమకు వర్తించే కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి వారి నుంచీ గ్రామ, వార్డు సచివాలయాల డిజిటల్‌ అసిస్టెంట్లు దరఖాస్తు స్వీకరించాలని, అవసరమైన ధ్రువపత్రాలు అందుబాటులో లేవనే కారణంతో తిరస్కరించరాదని ఆదేశించారు. దరఖాస్తుదారులు అందజేసిన వివరాలను సంబంధిత అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలించి, అర్హతను నిర్ధారిస్తారని తెలిపారు.

సర్వేల భారాన్ని తొలగించండి

అడ్డతీగల: అటు ప్రజలకు ఇటు తమకు ఇబ్బందిగా మారిన సర్వేల్లో కొన్ని మార్పులు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎల్లవరం పీహెచ్‌సీ ఎదుట వైద్య ఉద్యోగులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు పి.సత్యవతి మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్‌ఎల్‌ఈపీ సర్వే వల్ల ప్రజలు, మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఓటీపీ, వేలిముద్ర విషయంలో సాంకేతిక సమస్యల వల్ల సర్వే ముందుకు సాగడం లేదన్నారు. ఈ రెండు ఆప్షన్లను ప్రభుత్వం తొలగిస్తే సర్వే సులువవుతుందని చెప్పారు. లేదా రోజువారీ ఐదారుగురిని మాత్రమే సర్వే చేసేలా వెసులుబాటు కల్పించాలని కోరారు. నిరసన అనంతరం సంబంధిత వైద్యాధికారులకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement