సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా ప్రజా పరిషత్తుల (జెడ్పీ) పునర్వ్యవస్థీకరణ వేగం అందుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ను నాలుగు జిల్లా పరిషత్‌లుగా పునర్విభజించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల ఐదో తేదీన ఆదేశాలిచ్చిన ప్రభుత్వం, ఈ నెల 25 నుంచి కొత్త జెడ్పీల కార్యకలాపాలు ప్రారంభించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24లోగా ప్రస్తుత పరిషత్తుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
ఇక చరిత్రగా మారనున్న ఉమ్మడి జెడ్పీ
ప్రజలకు పరిపాలనను చేరువ చేయాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసింది. దీనివల్ల కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను జిల్లా కేంద్రాల్లోను, వాటి సమీప ప్రాంతాల్లోను ఏర్పాటు చేశారు. దీంతో, ప్రజలకు ఏ అవసరం వచ్చినా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. జిల్లాల విభజనలకు కొనసాగింపుగా ప్రభుత్వం ఇప్పుడు జెడ్పీల విభజనకు సిద్ధమైంది. ప్రస్తుత ఉమ్మడి జెడ్పీ పదవీ కాలం ముగుస్తూండటంతో దీనిని విభజించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీన ఇచ్చిన 115, 116 జీవోల ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 25 నుంచి కొత్త జిల్లా ప్రజా పరిషత్తులు అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ విభాగం ఈ నెల 16న సర్క్యులర్ మెమో జారీ చేసింది. దీని ప్రకారం కొత్త జెడ్పీల ఏర్పాటులో ఫైళ్లు, రికార్డుల విభజనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాత జిల్లా పరిషత్ కార్యాలయాల్లోని ఈ–ఫైళ్లు, మాన్యువల్ ఫైళ్లు, రికార్డు గదుల్లోని మూసివేసిన ఫైళ్లతో పాటు పరిపాలన, ఆస్తులు, సర్వీసు వ్యవహారాలు, ఎన్నికలు, కోర్టు కేసులకు సంబంధించిన రిజిస్టర్లను గుర్తించి, పూర్తి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ పరిధిలో దశాబ్దాలుగా కొనసాగిన పరిపాలనా వ్యవస్థకు ముగింపు పలికి నాలుగు కొత్త వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పోలవరం జిల్లాలకు నాలుగు ప్రత్యేక జిల్లా ప్రజా పరిషత్తులు ఏర్పడనున్నాయి. కాకినాడ జెడ్పీ 20 మండలాలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జెడ్పీ 19, తూర్పు గోదావరి జెడ్పీ 22 మండలాలు,
పోలవరం జెడ్పీ 11 మండలాలతో ఏర్పాటు కానున్నాయి.
25న కొత్త సీఈవోల
బాధ్యతల స్వీకరణ
కొత్త జిల్లా పరిషత్తులకు ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈవోలు), ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (డిప్యూటీసీఈవోలు) నియామకానికి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త సీఈవోలు ఈ నెల 25న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ వెంటనే పాత పరిషత్ అధికారులతో సమన్వయం చేసుకుని రికార్డులు, ఫైళ్లు, ఇతర పరిపాలనా వ్యవహారాలను స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న 3 జిల్లా ప్రజా పరిషత్తులకు అధికారులు, సిబ్బందిని కేటాయించనున్నారు. ప్రస్తుత సిబ్బందిని తాత్కాలికంగా కొత్త పరిషత్తులకు సర్దుబాటు చేయనున్నారు. తుది సిబ్బంది కేటాయింపు రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆస్తులు, నిధులపైనా త్వరలో స్పష్టత
జెడ్పీల విభజనలో ఫైళ్లు, రికార్డులే కాకుండా ఆస్తులు, నిధులు, అప్పులు, మౌలిక సదుపాయాల పంపిణీ కూడా కీలకం కానుంది. వీటిపై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 25లోగా బదిలీకి సంబంధించిన రికార్డులన్నింటినీ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వీఆర్‌కే తేజ మైలవరపు ఆదేశాలు జారీ చేశారు.
25 నుంచి కొత్త జిల్లా పరిషత్తులు
ఉమ్మడి జెడ్పీకి
ఈ నెల 24 చివరి రోజు
ఫైళ్లు, రికార్డుల విభజన
పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు
ఉమ్మడి తూర్పు గోదావరి
జిల్లా పరిషత్ నాలుగుగా విభజన
తూర్పు గోదావరి, కాకినాడ,
కోనసీమ, పోలవరం
జెడ్పీలుగా ఏర్పాటు
కొత్త పరిషత్తులకు సీఈవో,
డిప్యూటీ సీఈవోల పోస్టింగ్‌కు కసరత్తు
సిబ్బంది తాత్కాలిక
కేటాయింపునకు ప్రతిపాదనలు


