రాజమహేంద్రవరం సిటీ: సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల ఆలిండియా సమ్మెతో పాటు, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని బ్యాంక్ ఉద్యోగులకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియనన్స్ నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త పిలుపు మేరకు వివిధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. ఇందులో భాగంగా కంబాల చెరువు వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐదు రోజుల బ్యాంకింగ్‌ను వెంటనే అమలు చేయాలని, అందరికీ సమానమైన పీఎల్‌ఐ వర్తింపజేయాలని, బ్యాంకు ఉద్యోగులు, అధికారుల ప్రధాన సమస్యలు, డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం, సంబంధిత యాజమాన్యాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. సుమారు 1,200 మంది అధికారులు, ఉద్యోగులతో మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు టి.శేషుకుమార్, శ్రీనివాసరావు, పాపారావు, ఎంఎస్‌ఎన్ రాజు, మురళీధర్, డీఎస్ పేరిశాస్త్రి తదితరులు నాయకత్వం వహించారు. సీపీఐ నేత మధు, ఏఐటీయూసీ నాయకుడు అరుణ్, ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్, ఎల్‌ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోదండరామ్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు ఆదివిష్ణుమూర్తి సంఘీభావం తెలిపారు.


