● మధ్యాహ్న భోజనం పునఃప్రారంభం
● కమిషనర్ ఆదేశాలతో విద్యార్థుల హర్షం
అన్నవరం: అన్నవరం దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీసత్యదేవ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులకు బుధవారం నుంచి మధ్యాహ్న భోజనాన్ని పునఃప్రారంభించారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత జూలై రెండో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించగా అన్నదానం నిధులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడంపై కొందరు దాతల ఫిర్యాదు మేరకు నిలిపివేసిన విషయం తెలిసిందే. అనంతరం విద్యార్థులు ఆందోళన చేయడం, ట్రస్ట్ బోర్డు మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని తీర్మానించి ఈఓ నల్లం సూర్యచక్రధరరావు కమిషనర్‌కు నివేదిక పంపారు. దీంతో కమిషనర్ స్పందిస్తూ దేవస్థానం నిధుల నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో రెండు కళాశాలల్లోని 600 మంది విద్యార్థులకు అన్నదానం నుంచి భోజనాలు పంపారు. అయితే ఈ భోజనాల ఖర్చును దేవస్థానం నిధుల నుంచి అన్నదానం అకౌంట్‌కు రీయింబర్స్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.


