తాడోపేడో తేల్చుకుంటా..! | - | Sakshi
Sakshi News home page

తాడోపేడో తేల్చుకుంటా..!

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

నిడదవోలు: తాడోపేడో తేల్చుకుంటాం.. తన డబ్బులు ఇచ్చే వరకూ కదిలేది లేదంటూ ఓ వృద్ధుడు సొసైటీ కార్యాలయంలో మంచం వేసుకుని పడుకుని వినూత్న నిరసనకు దిగాడు. సూర్యారావుపాలెం సొసైటీలో డిపాజిట్‌ చేసిన తన డబ్బులు తిరిగి చెల్లించే వరకూ కార్యాలయం నుంచి కదిలేది లేదంటూ 75 ఏళ్ల వృద్ధుడు చిట్టూరి నరసింహమూర్తి అన్నారు. సోమవారం సొసైటీ కార్యాలయానికి మంచం తీసుకొచ్చి, నిద్రించి అధికారుల తీరును ఎండగట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం సొసైటీలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయి. దీనివల్ల సుమారు 180 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2005– 2019 మధ్య కాలంలో అధిక వడ్డీ ఇస్తామంటూ రైతుల నుంచి రూ.కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు బాధితులు చెబుతున్నారు. సొసైటీలో జరిగిన అవకతవకలపై 2019లో అధికారులు విచారణ చేపట్టగా, సుమారు రూ.4.40 కోట్ల సొసైటీ నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. డిపాజిట్‌దారులకు డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితులు సోమవారం సొసైటీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు.

పీజీఆర్‌ఎస్‌లో నలుగురి ఫిర్యాదు

తమ డిపాజిట్‌ సొమ్ము తిరిగి చెల్లించాలని కోరుతూ లంకా ఈశ్వరి, లంకా రాధాకృష్ణ, చిట్టూరి నరసింహామూర్తి, చిట్టూరి లక్ష్మీదేవి అనే నలుగురు డిపాజిట్‌దారులు 2026 జూన్‌లో కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సహకార శాఖ కొవ్వూరు డివిజన్‌ అధికారులు బాధితులకు డబ్బులు చెల్లించాలని సొసైటీ చైర్‌పర్సన్‌కు లేఖ రాసినట్లు తెలిసింది.

అధికారుల మల్లగుల్లాలు

సూర్యారావుపాలెం సొసైటీలో 180 మంది రైతులకు చెందిన 408 డిపాజిట్‌ ఖాతాలకు సంబంధించి రూ.3,12,59,794 బకాయిలు ఉన్నట్లు సొసైటీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సొసైటీలో సుమారు రూ.76 లక్షల నగదు నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసిన నలుగురికి కలిపి సుమారు రూ.24 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే అందుబాటులో ఉన్న మొత్తం నగదును నలుగురికి చెల్లిస్తే మిగిలిన 176 మంది డిపాజిట్‌దారులకు ఏ విధంగా చెల్లింపులు చేయాలనే అంశంపై సొసైటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

రూ.19 లక్షలు డిపాజిట్‌ చేశా..

చిట్టూరి నరసింహమూర్తి, ఆయన భార్య లక్ష్మీదేవి వృద్ధాప్యంతో వ్యవసాయం చేసుకోలేక తమకున్న కొంత భూమిని విక్రయించి 2018లో సుమారు రూ.19 లక్షలను సొసైటీలో డిపాజిట్‌ చేశారు. ప్రతి నెలా వచ్చే వడ్డీతో కాలం గడపవచ్చని భావించారు. అయితే సొసైటీలో జరిగిన కుంభకోణంతో వడ్డీ సంగతి అటుంచి.. అసలుకే మోసం రావడంతో ఆ దంపతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నా సమస్య పరిష్కారం కాలేదని నరసింహమూర్తి తెలిపారు. తన డబ్బులు తిరిగి ఇచ్చే వరకు సొసైటీ కార్యాలయం నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఇంటి నుంచి మంచం తెచ్చుకొని కార్యాలయం లోపల వేసుకుని నిద్రించారు.

ఫ నా డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదు

ఫ సొసైటీ కార్యాలయంలో మంచం

వేసుకొని వృద్ధుడి నిరసన

ఫ మద్దతు ప్రకటించిన బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement