సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● గ్రావెల్‌కు పచ్చరెక్కలు
● తుపాకులగూడెం నుంచి తరలిస్తున్న ముఠా
● రూ.కోట్లు వెనకేసుకుంటున్న వైనం
● ఫిర్యాదు చేసినా అధికారుల చర్యలు శూన్యం
సాక్షి, రాజమహేంద్రవరం: కొండలను తవ్వేసి కొల్లగొట్టేస్తున్నారు. జిల్లాలోని తాళ్లపూడి మండలం తుపాకులగూడెం రెవెన్యూ పరిధి గోపవరం రోడ్డులోని కొండను అధికార అండతో ముఠాగా ఏర్పడి తవ్వేస్తున్నారు. యంత్రాలు, ట్రాక్టర్లు, లారీలతో కొండ వద్దకు చేరుకుని గ్రావెల్ తవ్వేసి దర్జాగా తరలించుకుపోతున్నారు. ఇక్కడ లభించేది నాణ్యమైన గ్రావెల్ కావడంతో మార్కెట్‌లో ఒక్కో లారీకి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ లభిస్తోంది. రోజుకు 200 లారీల గ్రావెల్ తరలించుకుపోతున్నారని.. ఈ లెక్కన ఒక్క రోజులోనే ఖర్చులు పోనూ రూ.20 లక్షలకు పైనే వెనకేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాళ్లపూడి మండలం పోచవరం, రాగోలపల్లి, తూపాకులగూడెం గ్రామాల రెవెన్యూ పరిధిలో గోపాలపురం వైపు గోపవరం వెళ్లే దారిలోని కొండలనూ తవ్వేస్తున్నారు. గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లోని అధికార పార్టీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందలాది టిప్పర్లలో గ్రావెల్ తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
పర్యావరణానికి తప్పని హాని
గజ్జరం శివారులోని తుపాకులగూడెం కొండపై ఇప్పటికే ఉన్న జామాయిల్ మొక్కలను తొలగిస్తున్నారు. సహజంగా పెరిగిన భారీ వృక్షాలను సైతం తొలగించి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. ముందుగా కొంతమంది మనుషులను పెట్టుకుని వారి సాయంతో మొక్కలు తొలగించి గ్రావెల్ తవ్వకానికి, తరలింపునకు అనుకూలంగా ఆ ప్రదేశాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తర్వాత అక్కడి గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. తర్వాత మరికొంత స్థలాన్ని తవ్వకానికి వీలుగా మొక్కలు తొలగించి సిద్ధం చేస్తున్నారు. రోడ్డు పక్కనే కొండ ఉండడంతో జనం కంట పడకుండా ఉండేందుకు సంబంధిత మనుషులు జామాయిల్ తోటలో ఉంటున్నారు. తవ్వకాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ బృందం వెళ్లేసరికి తమకేమీ సంబంధం లేదన్నట్లు వారు ఆ తోటలోకి జారుకున్నారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా...
తాళ్లపూడి మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై స్థానికులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. పీజేఆర్‌ఎస్‌లోనూ వినతిపత్రాలు ఇచ్చారు. తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ స్థానిక నాయకులతో కలిసి ఈ ఏడాది జూన్ 12న కలెక్టర్ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మైనింగ్ ఏడీ ఫణిభూషణ్‌రెడ్డి, ఇతర అధికారులు గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న కొండలను పరిశీలించి వెళ్లిపోయారు. అంతేతప్ప ఎవరు తవ్వకాలు జరుపుతున్నారో నిర్ధారించి చర్యలు తీసుకోలేదు. తాళ్లపూడి తహసీల్దార్‌కు, మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.. గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. అధికార పార్టీ అండతో మాఫియా చెలరేగిపోతోంది. రాత్రీ పగలు అనే తేడా లేకుండా కొండలను తవ్వేస్తున్నా, అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. బహిరంగంగా తవ్వకాలు జరుగుతున్నా, పట్టించుకునే వారే కరవవడం జనానికి విసుగు పుట్టిస్తోంది. జిల్లాలోని తాళ్లపూడి మండలంలో ఈ తంతు జరుగుతోంది.
లేఅవుట్లకు తరలిస్తూ..
కొవ్వూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్న విషయం తెలిసిందే. కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూముల్లో రాళ్లు వేసి ప్లాట్లుగా మార్చేసి అమ్మేస్తున్నారు. అలాంటి లేఅవుట్లను ఎత్తు చేసుకునేందుకు ఈ గ్రావెల్‌నే ఉపయోగిస్తున్నారు. కొవ్వూరుతో పాటు గోపాలపురంలోని కొన్ని ప్రాంతాలకు ఈ గ్రావెల్ తరలిపోతోంది. అక్కడి లేఅవుట్లతో పాటు ఖాళీ స్థలాలు, ఇళ్ల స్థలాలను ఎత్తు చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. సంబంధిత వ్యక్తుల నుంచి తవ్వకందారులు భారీగా నగదు వసూలు చేస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు.


