● కోర్టు ధిక్కారణ కేసుతో
దిగివచ్చిన ప్రభుత్వం
● ‘పురుషోత్తపట్నం’ రైతులకు న్యాయం
● క్రెడిట్ తమదంటున్న ‘కూటమి’ నేతలు
సీతానగరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయి, పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు న్యాయం జరుగుతోంది. దీని వెనుక రైతుల సుదీర్ఘ పోరాటం ఉంది. భూములు కోల్పోయిన బాధితులు స్వయంగా హైకోర్టును ఆశ్రయించి, న్యాయ పోరాటం చేసి తీర్పు సాధిస్తే.. ప్రస్తుతం దానిని తమ సొంత ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నించడం విచారకరం.
2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తూ పురుషోత్తపట్నం, చినకొండేపూడి రైతులకు ఎకరాకు రూ.28 లక్షలు, నాగంపల్లి రైతులకు ఎకరాకు రూ.24 లక్షల చొప్పున ఇస్తామంటూ జీఓ 88 జారీ చేశారు. పరిహారం అందుకోవడానికి కొంతమంది రైతులు తిరస్కరించడంతో ప్రభుత్వ అవార్డును పాస్ చేసి పురుషోత్తపట్నం రైతులకు ఎకరాకు రూ.17.76 లక్షలు, చినకొండపూడి రైతులకు ఎకరానికి రూ17.70 లక్షలు, నాగంపల్లి రైతులకు ఎకరాకు రూ.15.23 లక్షల పరిహారం అందిస్తామంటూ ప్రకటించారు. దీనితో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలంటూ 28 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అదే విధంగా సుమారు 75 మంది రైతులు కోర్టును ఆశ్రయించకుండా జిల్లా కలెక్టర్లకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. మరోపక్క ఈ విధంగా రైతులు పోరాటం కొనసాగించారు. చంద్రబాబు 2023 ఎన్నికల ప్రచారంలో పురుషోత్తపట్నం వచ్చినప్పుడు వడ్డీతో పరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చి, దానిని ఇప్పటికీ అమలు చేయలేకపోయారు. 2025 అక్టోబర్ 31న 2013 భూసేకరణ చట్టప్రకారం పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుమారు మూడు నెలల పాటు వేచి ఉన్న రైతులు ఎంతకీ పరిహారం రాకపోవడంతో కంటెంట్ ఆఫ్ కోర్ట్ నంబర్ 106/2026 తీర్పును అమలు చేయాలని హైకోర్టులో కేసు వేయగా విచారణకు వచ్చింది.
రూ.32.10 కోట్లు ఇస్తూ అనుమతులు
హైకోర్టులో అధికారులు ఎదుర్కొంటున్న కేసు విచారణతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిమిత్తం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, చట్టబద్ధమైన వడ్డీ చెల్లింపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 32,10,20,150 మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీఓ నంబర్ 496 విడుదల చేశారు. రైతుల సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలితంగా సెప్టెంబర్ 1న కోర్టు వాయిదా నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా జీఓ జారీ చేిసింది. కోర్టు ధిక్కార చర్యలకు భయపడి ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది.
ప్రజాప్రతినిధుల ఉత్తుత్తి ప్రకటనలు
రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు, పరిహారం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఇప్పుడు పరిహారం మంజూరు కాగానే ‘మా కృషి ఫలితమే‘, ‘మేమే నిధులు రప్పించాం‘ అంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమే. ఇది ముమ్మాటికీ రైతుల ఐక్యతకు, వారు చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటానికి, గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు దక్కిన విజయం.
పలు అనుమానాలు
అధికారులు అందించిన నోటీసులతో రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నోటీసు ఇస్తున్నామని పేర్కొన్నారు. అయితే నోటీసుల్లో ఎటువంటి పరిహారం ఇస్తున్నట్లు పేర్కొనలేదు. ఏడు నెలల వడ్డీ తరువాత అందిస్తామని అధికారులు నోటిమాటగా చెబుతున్నారని, లిఖిత పూర్వకంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ
బాధిత రైతులు వేసిన కంటెంట్ ఆఫ్ కోర్టు కేసులో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్‌లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనితో అధికారుల్లో కదలిక వచ్చింది.


