దేవరపల్లి: ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత విమర్శించారు. నల్లజర్లలోని పార్టీ మండల కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ జరిగిందోనని వెతుక్కోవాల్సి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కరవైందన్నారు. ఒంటరిగా మహిళలు, యువతులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ యువత, డీఎస్సీలో ఇబ్బంది పడిన వారంతా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నల్లజర్ల మండలం దూబచర్లలో వైఎస్సార్, వసంత్ నగర్ కాలనీ వాసులు తమ సొంత సొమ్ముతో సుమారు ఏడేళ్ల క్రితం నిర్మించిన ముఖద్వారానికి ఉన్న పార్టీ రంగులు మార్చి తెలుపు రంగులు వేయించి అధికారులను ఉపయోగించి అలజడి సృష్టించింది మీరు కాదా? అని ఎమ్మెల్యే వెంకట్రాజును ఆమె ప్రశ్నించారు. రంగులు మార్చగలిగారు కాని, ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్సార్ అభిమానాన్ని మార్చలేరనేది అర్ధం చేసుకోవాలన్నారు. పొగాకు రైతుల కష్టాలను తెలుసుకొనేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 5న దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించినట్టు ఆమె తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్‌కు సంఘీభావం తెలిపారన్నారు. ఈ నెల 5న నల్లజర్ల నుంచి ద్వారకాతిరుమలకు ఎమ్మెల్యే వెంకట్రాజు నిర్వహించిన సంకల్ప పాదయాత్రలో డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ఉపాధి కూలీలను కూడా బలవంతంగా తీసుకువచ్చారని ఆమె విమర్శించారు. అలాంటి మీరు తమ నేతను విమర్శించేందుకు సరిపోరని అన్నారు. వైఎస్ జగన్ ప్రజల అభిమాన నాయకుడని ఆమె తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడితే రాజకీయంగా ఎదుర్కొనలేక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దేనికని ఆమె అన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని నెగ్గనీయమని ఎమ్మెల్యే వెంకట్రాజు చెబుతున్నారని, దీనిని బట్టి ఈవీఎం టాంపరింగ్ ద్వారా గెలుపొందారని పరోక్షంగా అంగీకరించినట్టేనని ఆమె అన్నారు. ధైర్యం ఉంటే కూటమిగా కాకుండా సింగిల్‌గా వచ్చి పోటీ చేయాలని ఆమె సవాల్ చేశారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
మాజీ హోం మంత్రి వనిత విమర్శ


