16 నుంచి పదో తరగతి పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

16 నుంచి పదో తరగతి పరీక్షలు

Mar 7 2026 8:12 AM | Updated on Mar 7 2026 8:12 AM

జిల్లాలో 138 కేంద్రాల్లో నిర్వహణ

కలెక్టర్‌ కీర్తి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఈ నెల 16వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నట్టు కలెక్టర్‌ కీర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 1వ తేదీ వరకు సాగనున్న ఈ పరీక్షలకు జిల్లాలో 138 కేంద్రాలలో ఏర్పాట్లు చేశామని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 24,538 మంది ఈ పరీక్షలు రాస్తుండగా, రెగ్యులర్‌గా 13,322 మంది, ప్రైవేట్‌గా 11,216 మంది రాస్తున్నారని ఆమె తెలిపారు. వారిలో విద్యార్థులు 12,555 మంది, విద్యార్థినులు 11,983 మంది ఉన్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్‌ శాఖ ద్వారా కట్టుదిట్టమైన బందోబస్తు, స్ట్రాంగ్‌ రూమ్‌లకు 24 గంటల భద్రత, ప్రశ్న పత్రాల రవాణాకు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఆయా కేంద్రాల సమీపంలోని జెరాక్సు సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని తహసీల్దార్లను ఆదేశించామన్నారు. మున్సిపల్‌, గ్రామ పంచాయతీ అధికారులు తాగునీరు, ఫర్నిచర్‌ తదితర వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆయా రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, వైద్యశాఖ ఫస్ట్‌ ఎయిడ్‌ సదుపాయాలు కల్పించాలని, విద్యుత్‌ శాఖ నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలని ఆదేశించారు.

వాట్సాప్‌ ద్వారా హాల్‌ టికెట్లు

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా 95523 00009 నంబర్‌కు ‘ఏజీ’ అని మెసేజ్‌ చేస్తే, తదుపరి అందుబాటులో వచ్చే సేవల్లో ‘విద్యా సేవలు’ ఎంపిక చేసి, ఎస్‌ఎస్‌సీ హాల్‌ టికెట్‌పై క్లిక్‌ చేయాలన్నారు. అనంతరం విద్యార్థి అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. హాల్‌ టికెట్‌లో వివరాలు సరిచూసుకుని తేడాలు ఉంటే సంబంధిత హెచ్‌ఎంలకు తెలియజేయాలని కలెక్టర్‌ సూచించారు. పాఠశాలల లాగిన్‌ ద్వారా కూడా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement