గళమెత్తుతూ.. కదం తొక్కుతూ.. | - | Sakshi
Sakshi News home page

గళమెత్తుతూ.. కదం తొక్కుతూ..

Feb 28 2026 7:28 AM | Updated on Feb 28 2026 7:28 AM

గళమెత

గళమెత్తుతూ.. కదం తొక్కుతూ..

అంగన్‌వాడీల సమరభేరి

ఉద్యోగ భద్రత కల్పించాలి

కనీస వేతనాలు రూ.26 వేలకు పెంచాలి

హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి

యాప్‌ల భారం తగ్గించాలి

డిమాండ్ల సాధనకు పోరుబాట

మార్చి 2న మహాధర్నా దిశగా అడుగులు

సాక్షి, రాజమహేంద్రవరం: అధికారం దక్కించుకునేందుకు అరచేతిలో వైకుంఠం చూపించి.. తీరా గద్దెనెక్కాక తమను నిలువునా వంచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై అంగన్‌వాడీలు సమరభేరి మోగించారు. ఇప్పటికే వివిధ స్థాయిల్లో దశల వారీ ఆందోళనలు చేపట్టి, గళమెత్తి తమ సమస్యలు వినిపించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో.. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా వచ్చే నెల 2న విజయవాడలో మహాధర్నా నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు.

బాలలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య రక్షణకు క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీ సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, పసి పిల్లలు, గర్భిణులు, బాలింతల సంరక్షణ, పౌష్టికాహారం పంపిణీ వంటి కార్యక్రమాల నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్నారు. అంగన్‌వాడీ విధులకు తోడు ప్రభుత్వం వీరిపై ఇతర భారాలు సైతం మోపుతోంది. గ్రామ స్థాయిలో బూత్‌ లెవెల్‌ అధికారులుగా ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ పనులు సైతం వీరికి అప్పగిస్తోంది. ఇంతగా శ్రమిస్తున్న తమపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతోందని, కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఇతర పనులు అంటగట్టి వేధిస్తోందని అంగన్‌వాడీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు అనేక హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత షరా మామూలుగానే వాటిని తుంగలో తొక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు సమరభేరి మోగిస్తున్నారు.

కనీస వేతనాలేవీ..

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా 8 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు, 1,798 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 24,879 మంది చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు పోషకాహారం అందిస్తున్నారు. మొత్తం 43,259 మంది పిల్లలు, 16,926 మంది గర్భిణులు, బాలింతలకు సమగ్ర పోషణ సేవలు అందజేస్తున్నారు. జిల్లాలో సుమారు 3 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారు. చాకిరీ ఎక్కువ.. జీతం తక్కువ అన్న చందంగా తమ పరిస్థితి తయారైందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విధులు నిర్వహించే అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల వంటి వారికి కనీస వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు.

పనిభారం పెరిగిందిలా..

కనీస వేతనం ఇవ్వకపోగా.. రోజువారీ విధులకు తోడు వివిధ యాప్‌ల పేరిట తమపై పని భారం పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ యాప్‌ పోషణ ట్రాకర్‌లో డైలీ అటెండెన్స్‌ ఇవ్వాలి. వీహెచ్‌ఎన్‌డీ యాప్‌లో పిల్లల బరువులు, రిజిస్ట్రేషన్లు, హౌస్‌ విజిట్లు, హెల్త్‌ చెకప్‌లు, టేక్‌ హోమ్‌ రేషన్‌ వివరాలు నమోదు చేయాలి. దీని కోసం లబ్ధిదారుల ఫేస్‌ రిజిస్ట్రేషన్‌ (ముఖ ఆధారిత నమోదు) తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా బాల సంజీవని యాప్‌, ఏడబ్ల్యూసీ డైలీ ట్రాకర్‌ వంటి యాప్‌లలో వివరాల నమోదు కష్టతరంగా మారుతోంది. నెట్‌వర్క్‌ సరిగ్గా లేకపోవడం, సర్వర్లు సక్రమంగా పని చేయక పోవడంతో ఫేస్‌ రిజిస్ట్రేషన్‌ చాలా ఇబ్బందికరంగా మారుతోంది.

పనిభారం తగ్గించాలి

అంగన్‌వాడీ సిబ్బందికి పనిభారం పెరిగిపోయింది. రోజంతా యాప్‌లతోనే కుస్తీ పట్టాల్సి వస్తోంది. ఒక్కోసారి నెట్‌వర్క్‌ పని చేయకపోవడం, సర్వర్‌ బిజీగా ఉండటంతో ఆ రోజు పని మర్నాడు చేయాల్సి వస్తోంది. అన్నింటినీ కలిపి ఒక్క యాప్‌గా చేస్తే పనిభారం తగ్గుతుంది. ఉద్యోగ భద్రత కల్పించాలి.

– మాణిక్యాంబ, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌

అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు

హామీలు నెరవేర్చాలి

సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలి. పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల విలీనాన్ని నిలుపు చేయాలి. మా డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగనున్నాం.

– బేబీరాణి, కార్యదర్శి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు

ఇవీ డిమాండ్లు

అంగన్‌వాడీ వ్యవస్థ అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా వారి జీతాల విషయంలో న్యాయస్థానాలు ఎన్ని ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం తమకిస్తున్న రూ.10 వేల వేతనం ఏ మూలకూ చాలడం లేదని అంగన్‌వాడీ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. రోజువారీ కూలి పనులకు వెళ్లినా నెలకు రూ.15 వేలు లభిస్తాయని, అటువంటిది గొడ్డు చాకిరీ చేస్తున్నా రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నారు.

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.

గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలి.

ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగానే వేసవి సెలవులివ్వాలి.

అంగన్‌వాడీలు మరణిస్తే ప్రభుత్వం నుంచి వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి బెనిఫిట్స్‌ అందడం లేదు. వారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్లు ఇవ్వాలి.

ఉద్యోగ భద్రత కల్పించాలి.

గళమెత్తుతూ.. కదం తొక్కుతూ..1
1/2

గళమెత్తుతూ.. కదం తొక్కుతూ..

గళమెత్తుతూ.. కదం తొక్కుతూ..2
2/2

గళమెత్తుతూ.. కదం తొక్కుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement