నమో భగవతే నారసింహాయ
● కన్నుల పండువగా కోరుకొండ
లక్ష్మీనరసింహుని కల్యాణోత్సవం
● వైభవంగా రథోత్సవం
● వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం
మధురపూడి: నమో భగవతే నారసింహాయ.. అంటూ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామిని భక్తజనం కొలిచింది. స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల సందర్భంగా శుక్రవారం కోరుకొండలో ఆధ్యాత్మిక కెరటం ఎగసిపడింది. గోవింద నామస్మరణ గ్రామమంతటా ప్రతిధ్వనించింది. బుగ్గన చుక్క.. పట్టు వస్త్రాలతో సర్వాలంకాలర భూషితులైన స్వామివారి పరిణయ మహోత్సవాన్ని కన్నులారా తిలకించిన భక్తులు ఆనందంతో పులకించిపోయారు.
కోలాహలంగా రథోత్సవం
స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే కోరుకొండకు తరలివచ్చారు. పలువురు భక్తులు ఉదయమే స్వామివారి కోనేటిలో పుణ్యస్నానమాచరించారు. అక్కడి నుంచి కొండపై స్వయంభువుగా కొలువుదీరిన స్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.54 గంటలకు అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను రథంపై వేంచేయించారు. అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. కొండ వద్ద ప్రారంభమైన రథోత్సవం దేవస్థానం రోడ్డు, రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, వడ్డీలపేట, మత్స్యకారులవాడ, సాయిబాబా గుడి, అంకాలమ్మవారి గుడి, శివాలయం మీదుగా సాగింది. గరగ నృత్యాలు, బ్యాండ్‌మేళాలు, కోలాటం, తీన్‌మార్, శక్తి వేషధారణలు, కేరళ చండా వాయిద్యాలతో రథోత్సవం ఆద్యంతం కోలాహలంగా జరిగింది. దారి పొడవునా భక్తులు రథం పైకి అరటి పండ్లు వేస్తూ భక్తితో స్వామికి మొక్కారు. సాయంత్రం 5.40 గంటలకు రథోత్సవం తిరిగి ఆలయానికి చేరింది. అనంతరం, మేళతాళాలతో స్వామి, అమ్మవార్లను ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. దీంతో, రాజమహేంద్రవరం – గోకవరం మార్గంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. రథంపై కొలువుదీరిన స్వామివారిన వైఎస్సార్ సిపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దర్శించుకున్నారు. అంతకు ముందు కొండపై కొలువుదీరిన స్వామి వారిని కూడా ఆయన దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, అదనపు ఎస్పీ చెంచురెడ్డి, నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ, సీఐ మూర్తి, ఎస్సై ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అంగరంగ వైభవంగా...
శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవం రాత్రి 9 గంటలకు కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత వధూవరులకు శాస్త్రోక్తంగా మంగళస్నానాలు నిర్వహించారు. అనంతరం, దేవస్థానం కల్యాణ మండపంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితులు పాణింగపల్లి పవన్‌కుమార్ ఆచార్యులు కల్యాణ క్రతువు నిర్వహించారు, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఎస్‌పీ రంగరాజ భట్టర్, అర్చకుల పర్యవేక్షణలో కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది.
రెడ్డి పంతులు సత్రంలో అన్నసమారాధన
స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా స్థానిక విరియాల రెడ్డిపంతులు సత్రంలో ఐదు రోజుల పాటు నిర్వహించే అన్న సమారాధన శుక్రవారం ప్రారంభమైంది. అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈదర సుబ్బారావు, సత్రం ఈఓ లక్ష్మీకుమార్, కోరుకొండ సర్పంచ్ లక్ష్మీ సరోజ తదితరులు అన్నసమారాధనను పర్యవేక్షించారు.
రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
రథోత్సవంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నమో భగవతే నారసింహాయ
నమో భగవతే నారసింహాయ


