జీఎన్‌ఎం పరీక్షల్లో అవకతవకలపై విచారణ పూర్తి | - | Sakshi
Sakshi News home page

జీఎన్‌ఎం పరీక్షల్లో అవకతవకలపై విచారణ పూర్తి

Feb 28 2026 7:28 AM | Updated on Feb 28 2026 7:28 AM

జీఎన్‌ఎం పరీక్షల్లో అవకతవకలపై విచారణ పూర్తి

జీఎన్‌ఎం పరీక్షల్లో అవకతవకలపై విచారణ పూర్తి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జీజీహెచ్‌లో నిర్వహించిన జీఎన్‌ఎం నర్సింగ్‌ పరీక్షల్లో జరిగిన అవినీతిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ శుక్రవారం విచారణ చేపట్టింది. కాకినాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, ఆర్‌ఎంసీ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మునిరత్నమ్మ, అడ్మినిస్ట్రేటర్‌ శ్రీధర్‌ల ఆధ్వర్యాన రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌లో 44 మందిని విచారించారు. వీరందరికీ 25 ప్రశ్నలు ఇచ్చారు. లంచాలు వసూలు చేసి కాపీయింగ్‌ నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ జీజీహెచ్‌ నర్సింగ్‌ స్కూల్‌ ట్యూటర్‌ సుజాత, ఒంగోలు నర్సింగ్‌ స్కూల్‌ ట్యూటర్‌ మాధవీలతలకు 50 ప్రశ్నలతో పత్రాలు ఇవ్వడంతో పాటు పత్రికల్లో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పరీక్షలు అయిన తర్వాత కూడా సుజాత పలు నర్సింగ్‌ స్కూళ్లకు ఫోన్లు చేసి డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని గుర్తించారు. విచారణకు ముందు నిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీ బృందం ప్రైవేటు నర్సింగ్‌ స్కూళ్ల నుంచి వివరణలు సేకరించింది. ఆయా ప్రిన్సిపాళ్లతో మాట్లాడి, డబ్బు చెల్లించిన ఆధారాలు సేకరించారు. అలాగే, ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి సుజాత బృందం పరీక్షల కాలమంతా ఆహారం, వసతి ఏర్పాటు వరకూ ప్రయోజనాలు పొందారని కమిటీ గుర్తించింది. థియరీ పరీక్షలతో పాటు అంతకు ముందు నిర్వహించిన ప్రాక్టికల్‌ పరీక్షల్లో అవినీతికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఓఎస్‌డీలు సుజాత, మాధవీలతలతో పాటు పలువురు అధికారులను కూడా లోతుగా విచారించారు. ప్రతి ఒక్కరి నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 7 గంటల వరకూ సాగింది. ఇద్దరు స్టాఫ్‌ నర్సులు సహా మరో ఇద్దరు నాలుగో తరగతి ఉద్యోగులు వివిధ కారణాలతో ఈ విచారణకు హాజరు కాలేదు. పరీక్షల నిర్వహణకు ఏమాత్రం సంబంధం లేని పలువురు ఉద్యోగుల్ని విచారించడం వివాదానికి దారి తీసింది. విచారణ నివేదికను రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు సమర్పిస్తామని కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ లావణ్య కుమారి తెలిపారు. అంతకు ముందు విచారణలో భాగంగా పరీక్షలు నిర్వహించిన హాళ్లతో పాటు నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాళ్లతో రహస్య సమావేశం నిర్వహించిన ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement