పుష్కరాలకు రైల్వే శాఖ సిద్ధం కావాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు రైల్వే శాఖ ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. పుష్కరాలకు రైల్వే శాఖ ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై తన క్యాంపు కార్యాలయంలో ఆమె శుక్రవారం విస్తృతంగా సమీక్షించారు. సాధారణ యాత్రికులకు సౌకర్యాలు, పుష్కర్ నగర ఏర్పాట్లు, టికెట్ల జారీ విధానం, యాత్రికుల రాకపోకల నిర్వహణ, విభాగాల వారీ సమన్వయం వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. 2003, 2015 పుష్కరాల సందర్భంగా వచ్చిన భక్తుల సంఖ్య, వివిధ మార్గాల ద్వారా రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలో నడిపిన రైళ్ల వివరాలను పరిశీలించారు. వచ్చే పుష్కరాలకు రైళ్లలో ప్రతి రోజూ సగటున 5.50 లక్షల మంది యాత్రికులు వస్తారనే అంచనాతో అదనపు రైళ్ల ప్రతిపాదనలు, అవసరమైన ఏర్పాట్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, నిఘా వ్యవస్థ బలోపేతం, సాధారణ టికెట్ల జారీకి అదనపు బుకింగ్ కౌంటర్ల ఏర్పాటు, అదనపు సిబ్బంది నియామకం, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై విభాగాల వారీగా అధికారులు వివరాలు సమర్పించారు. విజయవాడ జోన్ రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ షణ్ముఖ వడివేల్ ఎస్ గత పుష్కరాల గణాంకాలను వివరించారు. 2003లో 13 రోజుల వ్యవధిలో మొత్తం 20.29 లక్షల మంది, 2015లో 15 రోజుల్లో 39.31 లక్షల మంది రైళ్ల ద్వారా రాకపోకలు సాగించారన్నారు. వచ్చే పుష్కరాలకు 12 రోజుల వ్యవధిలో సుమారు 64 లక్షల మంది రాకపోకలు సాగించవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ముఖ్యంగా రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ అధికంగా ఉండే అవకాశముంటుందని చెప్పారు. అదనపు ప్రత్యేక రైళ్లు నడపడం, ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, ప్రయాణికుల మార్గదర్శక సూచికల ఏర్పాటు, రైల్వే స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు, అత్యవసర సేవల సమన్వయం వంటి అంశాలపై కార్యాచరణ ప్రణాళికను వివరించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ, భద్రతా వ్యవస్థీకరణపై చర్చించారు. రైల్వే స్టేషన్లు, పుష్కర్ ఘాట్‌లు, ముఖ్య కూడళ్ల వద్ద అదనపు పోలీసు బలగాల మోహరింపు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రత్యేక నియంత్రణ గదుల ఏర్పాటు, టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


