ఎడాపెడా.. దేవడా! | - | Sakshi
Sakshi News home page

ఎడాపెడా.. దేవడా!

Feb 27 2026 7:34 AM | Updated on Feb 27 2026 7:34 AM

ఎడాపె

ఎడాపెడా.. దేవడా!

ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌పై సొంత

పార్టీ జనసేన నేతల తిరుగుబాటు

సామాజిక మాధ్యమాల వేదికగా

విమర్శల వెల్లువ

కొత్తగా సామాజిక వర్గాల వారీగా చీలిక

అదే బాటలో టీడీపీ క్యాడర్‌

ఎమ్మెల్యేపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు

సాక్షి, అమలాపురం: రాజోలు కూటమిలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. జనసేన శాసనసభ్యుడు దేవ వరప్రసాద్‌పై అటు సొంత పార్టీకి చెందిన జనసేన, మిత్రపక్షమైన టీడీపీ వర్గాలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. సామాజిక మాధ్యమాల వేదికగా బురద జల్లుతుండడంతో దేవ వరప్రసాద్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

రాజోలులో గడిచిన రెండు ఎన్నికల్లో జనసేన విజయం సాధించింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ ఒక మోస్తరు నాయకుడు కూడా చిన్నచిన్న విషయాలను పార్టీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టడంతో స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ ఉక్కబోతకు గురవుతున్నారు. తామే వరప్రసాద్‌ను నియోకజకవర్గానికి పరిచయం చేశామని, తాము లేకుంటే ఆయనకు ఇక్కడ స్థానమే లేదంటూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. జనసేన పార్టీలో ఉన్న గ్రూపుల నాయకులతో స్వయంగా పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడినా ఫలితం లేదు. ఆయన రాజోలు పర్యటన తరువాత ఇక్కడ విభేదాలు తార స్థాయికి చేరడం గమనార్హం. కలిసి పనిచేయాలని పవన్‌ చెప్పిన తరువాత అసంతృప్తి జ్వాలలు మరింతగా ఎగసిపడుతున్నాయి.

ఎమ్మెల్యే వరప్రసాద్‌పై జనసేనలో రెండు,మూడు వర్గాలు బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నాయి. పార్టీలోను, నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ పార్టీని బజారును పడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే మౌన ముద్ర దాల్చుతుండడం పార్టీలో మిగిలినవారికి మింగుడు పడడం లేదు. అధిష్టాన పెద్దలు కూడా ఆయా వర్గాలను ప్రోత్సహించడం, తాను ఎన్నిసార్లు అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినా పెద్దలు సర్దుబాటు చేయకపోవడంతో ఎమ్మెల్యే చేసేది ఏమీ లేక మిన్నకుండా పోయారని వినికిడి. ఇదిలా ఉండగా ఇటీవల పార్టీకి చెందిన ఎన్‌ఆర్‌ఐ నాయకుడు యెనముల వెంకట పతిరాజు సామాజిక మాధ్యమం వేదికగా ఎమ్మెల్యేపై పరుష పదజాలంతో వీడియో పెట్టడం వివాదం సామాజిక వర్గాల మధ్య పోరుకు దారితీసింది. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కించపరచడంపై వారు మండిపడుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు పట్టుపడుతుండడంతో రాజోలు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. జనసేనతోపాటు టీడీపీకి చెందిన దళిత వర్గానికి చెందిన నాయకులు సామాజిక మాధ్యమాలలో మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన గెడ్డం సింహ, చాగంటి స్వామి వంటి నేతలు మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యే కాబట్టే ఇలా వ్యక్తగత దూషణకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. జనసేనకు చెందిన దళిత నాయకులు జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విరుచుకు పడ్డారు. జనసేన అసంతృప్తి నాయకునిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మలికిపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

టీడీపీలో సైతం అసంతృప్తి సెగలు

రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌పై కూటమి పార్టీకి చెందిన నియోజకవర్గ టీడీపీ నాయకులు సైతం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో తమను కలుపుకుని వెళ్లడం లేదని, ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ వద్ద తమ అక్రోశాన్ని వెళ్లగక్కారు. దీనితో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా గొల్లపల్లి అమూల్యను నియమించారు. ఈ నియామకం ఆ పార్టీలో కొత్త విభేదాలకు, గ్రూపులకు దారి తీసింది. ఇదే సమయంలో అమూల్య, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ల మధ్య కూడా కొత్త వివాదాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గ కార్యక్రమాలలో తమను పట్టించుకోవడం లేదని ఆమూల్య ఆరోపిస్తున్నారు. దీనిపై ఇటీవల అమలాపురంలో రాజోలు టీడీపీ కీలక నాయకులు సమావేశమై పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇటు జనసేన, అటు టీడీపీ వర్గాలుగా వీడిపోయి రాజోలు కేంద్రంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌పై విమర్శలకు దిగుతున్నారు.

ఎడాపెడా.. దేవడా!1
1/2

ఎడాపెడా.. దేవడా!

ఎడాపెడా.. దేవడా!2
2/2

ఎడాపెడా.. దేవడా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement