వైద్యుల మల్లగుల్లాలు
● విషమంగా కల్తీపాల బాఽధితుల పరిస్థితి
● విరుగుడు ఇంజెక్షన్లు ఎంత డోసు ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్న వైనం
● ఆ ఎనిమిది మంది గురించి
రెండు రోజులు ఆగితేనే కానీ
ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు
● పాల వ్యాపారి గణేష్‌ను విచారించేందుకు పోలీసుల సిద్ధం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై రాజమహేంద్రవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 15 మందిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యకుమారి అనే బాధితురాలికి బుధవారం అర్ధరాత్రి గుండె సమస్య రావడంతో వైద్యులు ఆందోళన చెందారు. సకాలంలో స్పందించి ఆమెకు సీపీఆర్ చేసి అత్యవసర మందులు అందించడంతో తిరిగి కోలుకుంది. విషమంగా ఉన్న ఎనిమిది మంది పరిస్థితి మరో రెండు రోజులు దాటితే కానీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. రెయిన్‌బో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారుల్లోనూ ఒకరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కిడ్నీలు విఫలమైన ఇద్దరికి డెల్టా ఆసుపత్రిలో డయాలసిస్ జరుగుతోంది. బొల్లినేని ఆసుపత్రిలో ఎనిమిది మందిలో ఐదుగురు వెంటిలేటర్, డయాలసిస్ మీద ఉండగా, మరో ముగ్గురికి డయాలసిస్ జరుగుతోంది.
ఫోమోఫైజోల్ ఇంజెక్షన్లపై తర్జన భర్జన
బాధితులకు మెరుగైన వైద్యం అందించే దిశగా ముంబై నుంచి రప్పించిన ఫోమోఫైజోల్ ఇంజెక్షన్లు ఏ విధంగా, ఎంత డోసు ఇవ్వాలనే దానిపై వైద్య బృందం మల్లగుల్లాలు పడుతోంది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి అక్కడ వైద్య బృందంతో ఇంజెక్షన్ల డోసులపై చర్చించారు. వీటిని బాఽధితులకు శుక్రవారం నుంచి అందించనున్నట్టు సమాచారం. ఈ ఇంజెక్షన్లు వ్యాధి ప్రాథమిక దశలో ఉన్న వారికి మెరుగ్గా, కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ జరుగుతున్న వారికి అంతంత మాత్రంగా ఫలితాలు ఇస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదీ ప్రిడ్జి లీకేజీ వల్ల పాలలో ఇథనాల్ గ్లైకాన్ కలిస్తేనే ఈ ఇంజెక్షన్లు పనిచేస్తాయి. వేరే ఏ రసాయనాలు కలిసినా ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. పాలలో ఏ విధంగా కల్తీ జరిగిందో తెలియడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు రావడానికి మరో మూడు రోజులు సమయం పట్టవచ్చు. దీంతో బాధితులకు రికవరీ డోసు ఇవ్వడంలో ఆలస్యం అవుతోంది. ఇంజెక్షన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు ఏమీ రావని నిర్ధారణ అయ్యాక, రిపోర్టుతో పనిలేకుండా వాటిని బాఽఽధితులకు అందించేందుకు డాక్టర్లు సిద్ధమయ్యారు. విషమంగా ఉన్న 8 మందికి అత్యవసర వైద్యం అందిస్తున్నా, ఇంజెక్షన్లు ఇస్తే కానీ వారు ఎంతమేరకు కోలుకుంటారనేది అంచనా వేయలేమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఘటన జరిగి 11 రోజులు కావడం, బాధితుల పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని, మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జైలులో ఉన్న గణేష్‌ను
విచారించనున్న పోలీసులు
కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న పాల వ్యాపారి గణేష్‌ను మరోసారి సమగ్రంగా విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. న్యాయస్ధానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని ఘటన వివరాలపై నివేదిక తయారు చేయనున్నారు. ఇథనాల్ గ్లైకాన్ లీకయి పాలు కలుషితం అవడంతో పాటు, పాలల్లో కలిపిన రసాయనాల కారణంగా మరింత విషతుల్యమయ్యాయా, లేక ఇథనాల్ లీకేజీ వల్లే జరిగిందా అన్నది గణేష్ నిర్ధారించాల్సి వుంది. అతని వాంగ్మూలంతో.. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టులు సరిచూసుకుని ఎంతమేరకు నిజం చెప్పాడన్నది నిర్ధారణ చేసుకుంటారు. ఈ ఘటనపై గణేష్ తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. తాము కూడా అదే పాలు తాగామని, తమకు ప్రమాదం జరగలేదని ఆమె అంటోంది. నా కుమారుడంటే గిట్టని వారు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చునని చెబుతోంది.
కల్తీ పాల వినియోగదారుల
ఆరోగ్యంపై ఆరా
పాల వ్యాపారి గణేష్ సరఫరా చేసిన పాల వినియోగదారుల చిట్టా ఆధారంగా 110 కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. మరో వారం రోజుల పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కల్తీ పాల వినియోగదారుల ఆరోగ్య స్థితిని రికార్డు చేస్తారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మినహా గణేష్ వద్ద పాలు తీసుకున్న వారి శరీరంలో ఎటువంటి మార్పులు కనిపించలేదు.


