కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్డీవోగా రాజారమేష్
తాళ్లపూడి: కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్డీవోగా ఎం.రాజారమేష్ ప్రేమ్‌కుమార్‌ను గురువారం నియమించారు. ఆయన ప్రస్తుతం గెయిల్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆర్డీవో రాణి సుస్మిత బదిలీ కావడంతో ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ల్యాబ్ రిపోర్టు వచ్చాక
పరిస్థితిపై స్పష్టత
కల్తీ పాల బాధితులు ఆరోగ్యంపై కలెక్టర్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితుల వాస్తవ పరిస్థితిపై ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని కలెక్టర్ కీర్తి చేకూరి చెప్పారు. అమరావతి నుంచి సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. వరలక్ష్మి మిల్క్ డైరీ, నరసాపురం గ్రామం, కోరుకోండ మండలం నుంచి పాల సరఫరా నిలిపివేశామన్నారు. క్షేత్ర స్థాయిలో 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామన్నారు. 14 సర్వైవల్ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజూ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
డ్రగ్ కంట్రోల్ కార్యాలయాల
వద్ద ధర్నాలు రేపు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని, డ్రగ్ కంట్రోల్ విభాగంలో అవినీతిని అరికట్టాలని కోరుతూ శనివారం బల్క్ డ్రగ్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడుతున్నామని సీపీఐ రాష్ట్ర వర్గ సభ్యులు తాటిపాక మధు పేర్కొన్నారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ మందులు తయారీ కంపెనీలకు కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెడితే వీటిని మింగిన రోగులకు మాత్రం ఎక్కడా లేని కష్టాలు వచ్చిపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మందుల తయారీ వెనుక ఒక పెద్ద మెడికల్ మాఫియా ఉందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాటడానికి మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు గడప గడపకూ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరావు, సహాయ కార్యదర్శి కె.రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు పాల్గొన్నారు.
నామినల్ రోల్‌లో
సవరణలకు అవకాశం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) మార్చి 2026 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాల్లో (నామినల్ రోల్స్ ) తప్పులు సరిదిద్దుకోవడానికి పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించిందని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు గురువారం తెలిపారు. శనివారం వరకు సవరణలు చేసుకోవచ్చన్నారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవచ్చన్నారు. ఆధార్ తో ధృవీకరించిన వివరాలను మాత్రమే యూ డైస్ ప్లస్ పోర్టల్లో అప్‌డేట్ చేయాలన్నారు. ఈ మూడు రోజుల్లో రికార్డులు ఇంకా సరిపోలని వారికి మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో వివరాలు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
జనగణనపై శిక్షణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణకు సంబంధించి అధికారులకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27, 28, మార్చి 1 తేదీలలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ శిక్షణ జరగనుందని వెల్లడించారు. జనాభా గణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో, సంబంధిత అధికారులకు డిజిటల్ అప్లికేషన్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2027 జనాభా గణనను రెండు దశల్లో చేపడతామని తెలిపారు.
కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్డీవోగా రాజారమేష్


