కొండలనెక్కి.. స్వామిని మొక్కి
ఫ సిద్ధివారిపాలెంలో అయ్యప్ప సన్నిధికి ఖ్యాతి
ఫ శరణు ఘోషతో మార్మోగుతున్న క్షేత్రం
శంఖవరం: స్వామి శరణం.. అయ్యప్ప శరణం.. భగవాన్ శరణం.. అంటూ స్వాముల శరణు ఘోష ప్రకృతి అందాల నడుమ ప్రతిధ్వనిస్తోంది.. శంఖవరం మండలం సబ్‌ప్లాన్ ప్రాంతంలోని అయ్యప్ప క్షేత్రం భక్తులను ఆధ్యాత్మిక చింతనలో కట్టిపడేస్తుంది. స్వామి దర్శనంతో మది పులకిస్తుంది. వేళంగిలో జలధారలు, అంకంపాలెంలో నిర్మించిన పంబా క్షేత్రం మీదుగా వన యాత్ర ద్వారా చేరుకునే సిద్ధివారిపాలెంలోని అయ్యప్ప క్షేత్రం భక్తులకు సరికొత్త అనుభూతిని మిగుల్చుతోంది. వీటిని అయ్యప్ప భక్తుడు కుసుమంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్మించారు. అంకంపాలెంలో పంబా క్షేత్రం 36 సెంట్ల విస్తీర్ణంలో ఉండగా, సిద్ధివారిపాలెంలోని స్వామివారి క్షేత్రం 13 ఎకరాల్లో ఆధ్యాత్మికతను పంచుతోంది. 2009 మార్చి 8న అయ్యప్ప క్షేత్రాలకు శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే మాలధారణలు, ఇడుముడుల సమర్పణలు జరుగుతున్నాయి. కత్తిపూడి నుంచి శంఖవరం మీదుగా ఈ క్షేత్రానికి 22 కిలోమీటర్ల దూరం ఉంటోంది. అయ్యప్ప ఆలయానికి నేరుగా రహదారి సౌకర్యం ఉంది. శబరిమల మాదిరి యాత్రలా ఇక్కడ నైస్వర్గిక స్వరూపం ఉంటుందని భక్తులు అంటున్నారు.
కొండల నుంచి జలధార
వేళంగిలోని ఎత్తయిన కొండల నుంచి కాలానికి అతీతంగా జలధారలు వస్తుంటాయి. ఈ ప్రాంతానికి తీర్థ స్థలంగా పేరుంది. కార్తిక మాసంతో పాటు పర్వదినాల్లో ఇక్కడ ధార మల్లికార్జుడిని భక్తులు దర్శిస్తుంటారు. సిద్ధివారిపాలెంలోని అయ్యప్ప ఆలయంలో మాలధారులు పేటతుళ్లు ఆడి, పుణ్యస్నానాలు చేసేందుకు అనువుగా ఉంది.
అంకంపాలెం.. పంబా క్షేత్రం
వేళంగి ధారకు కొద్ది దూరంలోని అంకంపాలెంలో పంబా క్షేత్రం ఉంది. ఇక్కడ అయ్యప్ప జననం నుంచి స్వామివారి జీవిత విశేషాలను తెలిపే చిత్ర, శిల్పాల సమాహారం పందాలరాజు భవంతిలో కళ్లకు కడుతోంది. గణపతి, కుమారస్వామి, పార్వతీదేవి, ప్రశాంతరాముడు, క్షేత్ర పాలకులైన ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించారు. వేళంగిలో పేటతుళ్లు ఆడిన భక్తులు ఉప ఆలయాలున్న ఈ క్షేత్రాన్ని దర్శించి ముందుకు సాగుతారు.
సిద్ధివారిపాలెం.. స్వామి సన్నిధానం
పంబా క్షేత్రంగా ఉన్న అంకంపాలెం నుంచి ఐదున్నర కిలోమీటర్లు వనయాత్ర చేసి సిద్ధివారిపాలెంలోని అయ్యప్ప సన్నిధికి వెళ్లాలి. వన యాత్ర కోసం రహదారి నిర్మించారు. ఈ దారి మధ్యలోనే ఏర్పాటు చేసిన శరణగుత్తి, శబరి పీఠం వద్దే కన్నె స్వాములు భక్తులు కొబ్బరికాయలు కొట్టి అయ్యప్ప దర్శనానికి వెళ్తారు. ఈ సన్నిధిలో 18 మెట్ల అయ్యప్ప ఆలయం ఉంది.
ఆలయాల విశేషాలు
సిద్ధివారిపాలెం అయ్యప్ప ఆలయ తలుపులు 365 రోజులూ తెరిచి ఉంటాయి. మాలధారణ, ఇడుముడులు, నివేదన తదితర అయ్యప్ప దీక్ష పద్ధతులను ఆచరణలో ఉంచారు. మహిళలూ దర్శించుకునే వీలు కల్పించారు. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ప్రతి బుధవారం మహా పంచామృతాభిషేకం, నేతితో అభిషేకాలు జరుగుతాయి. ప్రతి ఏటా కార్తిక మాసంలో ఐదు లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆంధ్ర శబరిమలైగా ప్రసిద్ధికెక్కిందని అంటున్నారు.


