దిగులుబడి
పెరవలి మండలం కాకరపర్రులో నేలకొరిగిన వరి పైరును కట్టలు కడుతున్న రైతులు (ఫైల్)
సాక్షి, రాజమహేంద్రవరం: అన్నదాతల ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. కోటి ఆశలతో ఖరీఫ్ వరి సాగు చేపడితే.. పైరు పాలు పోసుకునే, గింజ గట్టి పడే దశలో ఉండగా.. గత నెలాఖరులో మోంథా విపత్తు విరుచుకు పడింది. పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులు, కురిసిన భారీ వర్షాలు రైతులకు కన్నీళ్లే మిగిల్చాయి. తాలు గింజలు ఎక్కువగా రావడంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దీంతో, పెట్టుబడి అయినా దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వచ్చింది. ఈ ఏడాది మాత్రం 35 బస్తాలు దాటే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు వరి కోతల దశలో సైతం వాతావరణం అనుకూలించలేదు. మోంథా విపత్తు ముగిసిందని ఊపిరి పీల్చుకుంటూండగా.. మళ్లీ తుపాను హెచ్చరికలు రావడంతో కలత చెందుతున్న రైతులు.. వరి కోతలు వేగంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం
తొలుత అల్పపీడనంతో వర్షాలు.. ఆ తర్వాత మోంథా తుపాను రైతులను నిండా ముంచాయి. ఈ పరిస్థితుల్లో పుట్టెడు కష్టాల్లో ఉన్న తమకు అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. తమ బాధలను కనీసంగా కూడా పట్టించుకోవడం లేదని తుపాను బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. నామ్ కే వాస్తేగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందే తప్ప.. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఈ పరిస్థితుల్లో తామెక్కడ నష్టపోతామోననే ఆందోళనతో రైతులు గత్యంతరం లేక దళారులకు తక్కువ ధరకే ధాన్యం విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకూ కోత పెడుతున్నారు.
పెరిగిన కోత ఖర్చులు
ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు ఒకవైపు వరి కోతలకు ఆదుర్దా పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరోవైపు కోత యంత్రాలు, ట్రాక్టర్లతో రవాణా తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో వరి కోత యంత్రానికి గంటకు రూ.2,600 తీసుకునే వారు. ప్రస్తుతం రూ.2,800 తీసుకుంటున్నారు. ట్రాక్టర్ అద్దె కూడా రూ.800 నుంచి రూ.1,000కి పెరిగింది. దీనికి తోడు వర్షానికి నేల వాలిన పనలను నిలబెట్టి కట్టేందుకు కూలీలకు సైతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
ధాన్యం దిగుబడులు ఇలా..
జిల్లావ్యాప్తంగా 79,666 హెక్టార్లలో రైతులు ఖరీఫ్ వరి సాగు చేపట్టారు. ఇప్పటి వరకూ 7,009 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. సగటు ధాన్యం దిగుబడి ఎకరానికి 35 బస్తాల లోపే నమోదైంది. మెరక భూముల్లో ఎకరానికి 30 నుంచి 35 బస్తాలు, పల్లపు పొలాల్లో 25 నుంచి 32 బస్తాల వరకూ మాత్రమే దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. అంటే ఎకరానికి సగటున 5 బస్తాల ధాన్యాన్ని రైతులు నష్టపోతున్నారు. ఈవిధంగా ఎకరానికి సుమారు రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకూ నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని పలువురు బెంగ పెట్టుకుంటున్నారు.
వైఎస్సార్ సీపీ హయాం.. స్వర్ణయుగం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాం రైతులకు స్వర్ణయుగమనే చెప్పుకోవాలి. పంట సాగుకు ముందే రైతుభరోసా కింద ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించడంతో రైతులు నిశ్చింతగా ఉండేవారు. అలాగే, సాగుకు అనువైన సమయంలో నీరు విడుదల చేయడంతో దిగుబడులు గణనీయంగా వచ్చేవి. జిల్లావ్యాప్తంగా 2023లో 73 వేల హెక్టార్లలో వరి సాగు జరగగా ఎకరానికి 40 బస్తాల వరకూ దిగుబడి వచ్చింది. ఏటా మూడు పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా 2022 నుంచి ఏటా ఖరీఫ్‌లో పది రోజులు ముందుగానే జూన్ 1వ తేదీనే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసేవారు. తద్వారా ప్రకృతి విపత్తులు, గోదావరి వరదల నుంచి పంటను గట్టెక్కించుకునే అవకాశం రైతులకు కలిగేది.
దిగుబడి తగ్గింది
మోంథా తుపాను కారణంగా గత ఏడాది ఖరీఫ్‌తో పోలిస్తే ప్రస్తుతం ధాన్యం దిగుబడులు బాగా తగ్గాయి. వర్షాల కారణంగా రైతులు భారీగా నష్టపోయారు. ఎకరానికి సగటున 35 బస్తాల దిగుబడి వస్తోంది. సాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం అందే పరిస్థితులు కనిపించడం లేదు. దీనికితోడు తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు, ఈదురు గాలులకు వరి పైరు నేలకొరిగింది. నేల వాలిన వరి పనలు కట్టేందుకు మళ్లీ డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. దీనివలన రైతులపై అదనపు భారం పడుతోంది.
– పరిమి సోమరాజు, వైఎస్సార్ సీపీ
రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి
అన్నదాతల ఆశలపై మోంథా నీళ్లు
పడిపోతున్న వరి దిగుబడులు
ఈదురు గాలులు, వర్షాల
ప్రభావంతో తీవ్ర నష్టం
గత ఏడాది ఎకరాకు 35 నుంచి 40 బస్తాల ధాన్యం దిగుబడి
ప్రస్తుతం 35 బస్తాల లోపే..
పెట్టుబడులు సైతం దక్కవని
రైతుల ఆందోళన
దిగులుబడి


