ఢిల్లీలో పేలుళ్లు.. జిల్లాలో తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీసులు సోమవారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. పేలుడు నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ పోలీసులను అప్రమత్తం చేశారు. జిల్లాకు వచ్చే మార్గాలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో పోలీసు బృందాలు సోదాలు నిర్వహించాయి. రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి, లాలాచెరువు, కాతేరు, ఏవీ అప్పారావు రోడ్డు, శ్యామలా సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో వాహనాలను, అనుమానితులను తనిఖీ చేస్తున్నారు.
పీజీఆర్‌ఎస్‌ఎకు
185 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 185 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అధికారులు నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో స్పందన లోపించడం వలన పై అధికారులకు ప్రజలు అర్జీలు అందజేస్తున్నట్లు కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర, మండల స్థాయి అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని, గ్రామ స్థాయి సిబ్బంది పని తీరును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని సూచించారు.
17 నుంచి లెప్రసీ క్యాంపెయిన్
ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జేసీ మేఘా స్వరూప్‌తో కలసి ఆమె కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
పుష్కరాల ప్రత్యేకాధికారిగా
వీరపాండ్యన్
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి జి.వీరపాండ్యన్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వీరపాండ్యన్ వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌గా ఉన్నారు.
కై వల్యరెడ్డికి
కలెక్టర్ అభినందన
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ 2029లో చేపట్టే అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికై న నిడదవోలుకు చెందిన కైవల్యరెడ్డిని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అభినందించారు. కలెక్టర్‌ను ఆమె క్యాంపు కార్యాలయంలో కైవల్యరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కైవల్యరెడ్డి సాధన జిల్లాకు మాత్రమే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. అంతరిక్ష రంగంలో మహిళగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమన్నారు. కైవల్యరెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆమె తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహాన్ని, కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఢిల్లీలో పేలుళ్లు.. జిల్లాలో తనిఖీలు
ఢిల్లీలో పేలుళ్లు.. జిల్లాలో తనిఖీలు
ఢిల్లీలో పేలుళ్లు.. జిల్లాలో తనిఖీలు


