అయినవిల్లి ఆలయం కిటకిట
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 237 మంది పాల్గొన్నారు. ఏడుగురికి అక్షరాభ్యాసాలు, ఎనిమిది మందికి తులాభారం నిర్వహించారు. ఒకరికి నామకరణ చేయగా శ్రీ లక్ష్మీగణపతిహోమంలో 21 జంటలు పాల్గొన్నాయి. స్వామికి ఒక భక్తుడు తలనీలాలు సమర్పించారు. 40 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 4,860 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,78,641 లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
అవార్డు నిరాకరించిన
విద్యుత్ శాఖ ఏఈ
మలికిపురం: ఉత్తమ సేవలకు అవార్డు వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా స్వీకరిస్తారు. అది అరుదుగా లభించే అవకాశం. అయితే అలా ఉత్తమ సేవలకు అవార్డుకు ఎంపిక అయిన మలికిపురం, సఖినేటిపల్లి మండలాల విద్యుత్ శాఖ ఏఈ బొలిశెట్టి ప్రసాద్ అవార్డు స్వీకరణకు నిరాకరించారు. ఇటీవల సంభవించిన పెను తుపానులో విశేష సేవలు అందించిన ప్రసాద్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగి అవార్డు స్వీకరణకు ఆహ్వానం వచ్చింది. శనివారం వెళ్లాలి. అయితే తుపానుకు దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ పనులలో సఖినేటిపల్లి మండలంలో విద్యుత్‌శాఖ ఎలక్ట్రీషియన్ యడ్ల శంకర్ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. మనస్థాపానికి గురైన ప్రసాద్ తనకు ప్రకటించిన అవార్డు తీసుకునేందుకు నిరాకరించారు.
హెచ్‌ఎం సస్పెన్షన్
పెదపూడి: గ్రామంలోని జీఎంప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఎంఈఓ–1గా పనిచేస్తున్న కె.సత్యనారాయణ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు కాకినాడ ఆర్‌జేడీ నాగమణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాఠశాల్లో విధి నిర్వహణలో అలక్ష్యం, అసభ్య ప్రవర్తనకు పాల్పడినట్లు జిల్లా విద్యాశాఖ ఉన్నత అధికారులకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు కాకినాడ డీవైఈఓ ఉత్తర్వులను సత్యనారాయణకు అందజేశారు.


