
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పేదలు తమ బిడ్డల వివాహాలు చేసుకునేందుకు వీలుగా రత్నగిరిపై పలువురు దాతలు ఉచిత కల్యాణ మండపాలు నిర్మించారు. కానీ, వీటి కేటాయింపులో దళారుల దందా సాగుతోంది. వారికి కొంతమంది దేవస్థానం సిబ్బంది అండదండలు ఉండటంతో పేదలకు ఉచిత కల్యాణ మండపాలు లభించడం దుర్లభంగా మారుతోంది. ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఉచిత కల్యాణ మండపాల కేటాయింపును దేవస్థానం అధికారులు సక్రమంగా పర్యవేక్షించకపోవడంతో దళారులు, కొంతమంది సిబ్బంది ఒక్కటై వివాహ బృందాలను దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజా ఉదంతమే దీనికి ఉదాహరణ.
రూ.25 వేలకు ఒప్పందం
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన తోట నాగతేజ గత శనివారం రాత్రి రత్నగిరిపై వివాహం చేసుకున్నారు. ఈ వివాహ ఏర్పాట్ల కోసం ఆయన గత ఆగస్టులో దేవస్థానానికి వచ్చారు. మట్టే వారి సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపంలో ఏసీ కల్యాణ మండపం, పక్కనే సత్రంలో రెండు ఏసీ గదులు, పురోహితుడు, సన్నాయి మేళం కోసం దేవస్థానం సీఆర్‌ఓ కార్యాలయాన్ని సంప్రదించారు. సత్రం గదులు, వివాహ మండపం వివాహానికి నెల రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేస్తారని అక్కడి అధికారులు చెప్పారు. అక్కడి నుంచి నాగతేజ వెలుపలకు రాగానే అశోక్, పోరి అనే ఇద్దరు దళారులు అతడి వద్దకు వెళ్లారు. అక్టోబర్ 11 వివాహానికి గదులు, వివాహ మండపం సెప్టెంబర్ 11న వస్తే రిజర్వ్ చేస్తారని చెప్పారు. ఆయన రానవసరం లేకుండా అన్నీ తామే ఏర్పాటు చేస్తామని, రూ.25 వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ మాటలు నమ్మిన నాగతేజ.. వారికి తన, పెళ్లి కుమార్తె ఆధార్ నకళ్లతో పాటు శుభలేఖ, రూ.15 వేల నగదు ఇచ్చారు. మిగిలిన రూ.10 వేలు వివాహ సమయంలో ఇస్తామని చెప్పారు. అయితే, వివాహం చేసుకునేందుకు గత శనివారం దేవస్థానానికి వచ్చిన నాగతేజకు నాన్ ఏసీ కల్యాణ మండపం, రెండు నాన్ ఏసీ గదులు మాత్రమే ఇచ్చారు. దీంతో, అతడు దళారులకు రూ.10 వేలకు బదులు రూ.7,500 మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.2,500 కూడా ఇవ్వాలని దళారులు గొడవకు దిగడంతో నాగతేజ పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి ఈఓ వీర్ల సుబ్బారావుకు ఫిర్యాదు చేశాడు. దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వివాదం సంగతి అలా ఉంచితే.. ఈ ఎపిసోడ్‌లో అసలు వ్యక్తులు రాకుండా దళారులు ఆధార్ కార్డులు ఇస్తే వివాహ మండపం, సత్రంలో గదులు ఎలా రిజర్వ్ చేశారు? సీఆర్‌ఓ కార్యాలయ సిబ్బంది ప్రమేయం లేకుండా ఇది జరిగే పనేనా వంటి అనేక సందేహాలు కలుగుతున్నాయి.
నెరవేరని దాతల లక్ష్యం
అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే శ్రీనివాస్ దంపతులు 2022లో 12 మినీ కల్యాణ మండపాలతో పెద్ద ఏసీ కల్యాణ మండపం నిర్మించారు. ఇదేవిధంగా విశాఖపట్నానికి చెందిన దాత ఎంఎస్ రెడ్డి కూడా 12 మినీ కల్యాణ మండపాలతో పెద్ద కల్యాణ మండపం నిర్మించారు. ఈ రెండు మండపాల్లో చెరో తొమ్మిది మినీ కల్యాణ మండపాల కేటాయింపును దేవస్థానానికి అప్పగించారు. మిగిలిన చెరో మూడు మండపాలను దాత సిఫారసు మేరకు కేటాయిస్తారు. ఈ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారు రూపాయి కూడా అద్దె చెల్లించనవసరం లేదు. అలాగే, ఒక్కో వివాహానికి రెండు గదులను దేవస్థానం అద్దె ప్రాతిపదికన ఇస్తుంది. వివాహ ముహూర్తానికి నెల రోజుల ముందు మాత్రమే ఈ కల్యాణ మండపాలను రిజర్వ్ చేస్తారు. ఈ విషయం తెలియక చాలామంది వివాహానికి చాలా రోజుల ముందే వస్తున్నారు. తీరా విషయం తెలిశాక మళ్లీ రాలేకపోతున్నారు. అటువంటి వారిని గుర్తించి, దళారులు వల విసురుతున్నారు.
ఇలా చేస్తే మేలు
దేవస్థానంలో వివాహ మండపాలు, సత్రం గదుల కేటాయింపుపై ఎటువంటి ప్రచారమూ లేదు. వీటిని వివాహాలకు నెల రోజుల ముందు మాత్రమే కేటాయిస్తారని ఫ్లెక్సీలు, మైకుల ద్వారా ప్రచారం చేయాలి.
సీఆర్‌ఓ కార్యాలయంతో పాటు దేవస్థానంలో దళారులు లేకుండా చర్యలు తీసుకోవాలి. వివాహ మండపాలు కేటాయించాలంటే పెళ్లి బృందం సభ్యులు సరిగ్గా నెల రోజుల ముందు మాత్రమే సీఆర్‌ఓ కార్యాలయం వద్దకు రావాలంటూ ప్రకటనలు చేయాలి.
వివాహ బృందాల వారికి అవసరమైన సమాచారం ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలి. ఆ నంబర్‌పై విస్తృత ప్రచారం చేయాలి.
వివాహాల సీజన్‌లో ఈఓ, ఇతర ఉన్నతాధికారులు తరచుగా వివాహ మండపాలు, సీఆర్‌ఓ కార్యాలయంలో తనిఖీలు చేయాలి. పెళ్లి బృందాల అభిప్రాయాలు తెలుసుకుని, వారి సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ఫ ఉచిత వివాహ మండపాలు కేటాయించడానికి ముందు, వివాహం అయ్యాక ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా అనే విషయమై ఆరా తీసి, ఆ మేరకు చర్యలు చేపట్టాలి.