పెళ్లి భోజనంలా..
అన్నదాన పథకంలో భక్తులకు పెళ్లి భోజనం మాదిరిగా ఆహార పదార్థాలు వడ్డిస్తారు. పులిహోర, స్వీట్, రెండు రకాల కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగుతో కలిపి కేవలం అరటి ఆకులోనే భోజనం పెడతారు. ఇక్కడకు వచ్చిన భక్తులతో పాటు వాడపల్లి క్షేత్రానికి వెళ్లి వస్తున్న వారు కూడా అన్నవరప్పాడులో ఆగి, అన్న ప్రసాదం స్వీకరిస్తారు. స్వామి వారికి ప్రతి ఏడాది వైశాఖ మాసంలో అంగరంగా వైభవంగా కల్యాణం జరుపుతారు. ఆ సమయంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకూ వారం రోజుల పాటు అన్నదానం చేయడం విశేషం. ప్రస్తుతం ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానాన్ని నిత్య అన్నదానంగా మార్చడానికి దేవదాయ ధర్మాదాయశాఖకు అనుమతులు కోరుతూ నివేదికలు సమర్పించారు.
● అన్నవరప్పాడు వెంకన్న ఆలయానికి భక్తుల రద్దీ
● ప్రతి శనివారం అన్నదానం
● పెళ్లి భోజనంలా ఆహార పదార్థాలు
● నిత్యాన్నదానంగా మార్చేందుకు చర్యలు
పెరవలి: జాతీయ రహదారి పక్కనే పెరవలి మండలం అన్నవరప్పాడులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్య కల్యాణం పచ్చతోరణంలా వెలుగొందుతోంది. నిత్యం ఈ ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ప్రతి శనివారం భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తారు. వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారు. అయితే కేవలం భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ కార్యక్రమం జరపడం ఇక్కడి ప్రత్యేకత.
ఆలయ చరిత్ర
అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం వెనుక పెద్ద చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన ఓసూరి సోమన్న కలలో తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామి సాక్షాత్కరించి, ఈ దివ్యస్థలిలో ఆలయం నిర్మించాలని ఆదేశించారంట. ఆయన ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలపడంతో అందరూ స్వామివారి ఆజ్ఞను పాటించాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి 1965లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామివారికి అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. పూర్వం ఇదే ప్రదేశంలో అత్రి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ క్షేత్రానికి ఇంతటి తేజస్సు లభించిందని నమ్మకం.
అన్నదాన పథకం
ఆలయంలో ఐదేళ్ల క్రితం అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని కేవలం భక్తుల విరాళాలతో మాత్రమే నిర్వహిస్తున్నారు. స్వామివారి మూలధనం నుంచి ఒక్క పైసా కూడా వినియోగించరు. ప్రతి శనివారం నిర్వహించే ఈ అన్నదానానికి భక్తులు ముందస్తుగానే తమ విరాళాలు అందిస్తారు. ఆలయంలో ప్రతి శనివారం 6 వేల నుంచి 9 వేల మంది వరకు భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రత్యేక రోజుల్లో వారి సంఖ్య మరో మూడు వేలకు పెరుగుతుంది.
ప్రతి వారం దర్శనం
అన్నవరప్పాడులో కొలువైన వేంకటేశ్వరస్వామిని ప్రతి శనివారం దర్శించుకుంటాను. దాదాపు పదేళ్లుగా ఆలయానికి వస్తున్నాను. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలను స్వామివారు తప్పకుండా తీర్చుతారు.
– కాపక పాపారావు, భక్తుడు, కాకరపర్రు
అన్నదానం బాగుంది
ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం చాలా బాగుంది. వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదం వడ్డిస్తారు. అది కూడా పెళ్లి భోజనంలా పెడతారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.
– కంటిపూడి సూర్యనారాయణ, భక్తుడు, తీపర్రు
భక్తుల తాకిడి
ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి శనివారం నిర్వహించే అన్నదానాన్ని నిత్యాన్నదానంగా మార్చేందుకు అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. 1965లో నిర్మించిన ఆలయం ప్రస్తుతం శిథిలస్థితికి చేరింది. దీంతో నూతన ఆలయ నిర్మాణానికి కూడా నివేదిక ఇచ్చాం.
– మీసాల రాధాకృష్ణ, ఆలయ ఈఓ, అన్నవరప్పాడు
విరాళాలు
అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకం కింద ఇప్పటి వరకు రూ.4 లక్షల డిపాజిట్లు, బంగారం 376 గ్రాములు, 30 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. భక్తులు నిత్య గోత్రార్చన కింద రూ.12 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఇవి స్వామివారికి శాశ్వత డిపాజిట్లు కాగా, ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం మాత్రం ఎప్పటికప్పుడు భక్తులు విరాళాలతో నిర్వహిస్తారు.
పెళ్లిళ్ల గుడి
ఆలయంలో ఏటా వేల సంఖ్యలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద ముహూర్తాల సమయంలో ఆలయ ప్రాంగణంతో పాటు రోడ్లపైనే వివాహాలు జరుపుతారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తారు. అందుకే ఈ వెంకన్న సన్నిధి.. పెళ్లిళ్లకు చల్లని పెన్నిధి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలామంది ఈ ఆలయాన్ని పెళ్లిళ్ల గుడిగా పిలుస్తారు.
భక్తులకు అన్నవరమై..
భక్తులకు అన్నవరమై..
భక్తులకు అన్నవరమై..
భక్తులకు అన్నవరమై..
భక్తులకు అన్నవరమై..
భక్తులకు అన్నవరమై..