లో గ్రేడ్‌.. వెరీ బ్యాడ్‌ | - | Sakshi
Sakshi News home page

లో గ్రేడ్‌.. వెరీ బ్యాడ్‌

Oct 15 2025 6:36 AM | Updated on Oct 15 2025 6:36 AM

లో గ్

లో గ్రేడ్‌.. వెరీ బ్యాడ్‌

దేవరపల్లి: వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మార్కెట్లో లో గ్రేడ్‌ పొగాకు అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయి. గత ఏడాది కొనుగోలు చేసిన లో గ్రేడ్‌ పొగాకు ఇప్పటికీ వ్యాపారుల వద్ద నిల్వ ఉండిపోయింది. ఈ ప్రభావం ఈ ఏడాది మార్కెట్‌పై పడిందని టుబాకో బోర్డు అధికారులు చెబుతున్నారు. రైతుల వద్ద ఉన్న నాణ్యమైన (బ్రైట్‌) గ్రేడ్‌ పొగాకు అమ్మకాలు దాదాపు పూర్తయ్యాయి. ఇక లో గ్రేడ్‌ పొగాకు మాత్రమే అమ్ముకోవలసి ఉంది. కానీ, దీనిని అడిగే నాథుడే లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు.

రూ.150 ఇవ్వాలి

ఈ ఏడాది లో గ్రేడ్‌ పొగాకు కొనుగోలుకు వ్యాపారులు మొదటి నుంచీ అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో, చివరిలో అమ్ముకోవచ్చునే ఉద్దేశంతో రైతులు దీనిని నిల్వ చేశారు. పొగాకు కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకోవడంతో ప్రస్తుతం తమ వద్ద ఉన్న లో గ్రేడ్‌ పొగాకును వేలం కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. అయితే, రెండు మూడు కంపెనీలు మాత్రమే తమకు నచ్చిన లో గ్రేడ్‌ పొగాకును మొక్కుబడిగా కొనుగోలు చేస్తున్నాయని వాపోతున్నారు. 2023–24లో లో గ్రేడ్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. కిలో రూ.170 వరకూ అమ్ముడు పోయింది. 2024–25లో కిలో రూ.130 నుంచి రూ.140కి అమ్ముడవడంతో మంచి రేటు వచ్చిందని రైతులు సంతోషించారు. ఈ ఏడాది ప్రస్తుతం కిలో రూ.70 నుంచి రూ.80కి మాత్రమే అమ్ముడు పోతోందని చెబుతున్నారు. ఈ ధర గిట్టుబాటు కాదని, కనీసం రూ.150 ఇవ్వాలని కోరుతున్నారు.

4 మిలియన్‌ కిలోల ఉత్పత్తి

పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో 2024–25 పంట కాలంలో సుమారు 4 మిలియన్‌ కిలోల లో గ్రేడ్‌ పొగాకు ఉత్పత్తి అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో వేలం కేంద్రంలో 5 లక్షల నుంచి 6 లక్షల కిలోల లో గ్రేడ్‌ పొగాకు ఉత్పత్తి జరిగిందన్నది వారి అంచనా. ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని దక్షిణాది వేలం కేంద్రాల ప్రాంతాల్లో నాణ్యమైన లో గ్రేడ్‌ పొగాకు తక్కువ ధరకు దొరుకుతోంది. దీంతో, ఇక్కడి ఉత్తర తేలిక నేలల (ఎన్‌ఎల్‌ఎస్‌) ప్రాంతంలోని లో గ్రేడ్‌ పొగాకు కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని అధికారులు అంటున్నారు. దక్షిణాది వేలం కేంద్రాల్లో కిలో రూ.60 నుంచి రూ.80 ధర పలుకుతోంది. ఎగుమతులకు అవసరమైన నికోటిన్‌ శాతం ఉన్న పొగాకు ఉత్పత్తి ఆ ప్రాంతాల్లో జరిగింది. ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రాంతంలో నికోటిన్‌ శాతం తక్కువగా ఉందని వ్యాపారులు అంటున్నారు. అక్కడ, ఇక్కడ దాదాపు ఒకే ధర పలుకుతున్నప్పటికీ, ఇక్కడ కొనుగోలు చేసిన పొగాకును గుంటూరు ప్రాంతానికి తరలించేందుకు రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయని చెబుతున్నారు. అయితే, లో గ్రేడ్‌ పొగాకు గ్రేడింగ్‌లో రైతులు అశ్రద్ధ చూపారని, మిక్సింగ్‌ గ్రేడ్‌ ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు ఇష్టపడటం లేదని అధికారులు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ ఏడాది లో గ్రేడ్‌ పొగాకు అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలూ పడుతున్నారు.

రూ.2,376 కోట్ల పొగాకు విక్రయాలు

పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ రూ.2,376 కోట్ల విలువైన 73.01 మిలియన్‌ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. మొత్తం 5,78,919 బేళ్ల అమ్మకాలు జరిగాయని బోర్డు రీజినల్‌ మేనేజర్‌ జీఎల్‌కే ప్రసాద్‌ తెలిపారు. ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకు 69.70 మిలియన్‌ కిలోలు, బ్లాక్‌ సాయిల్‌ పొగాకు 3.31 మిలియన్‌ కిలోల మేర అమ్మకాలు జరిగాయన్నారు. 2024–25 పంట కాలానికి 59 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 84 మిలియన్ల కిలోల పంట పండించారని తెలిపారు. కిలోకు గరిష్టంగా రూ.427, కనిష్టంగా రూ.70, సగటున రూ.310.71 చొప్పున ధర పలికిందని వివరించారు. బ్లాక్‌ సాయిల్‌ పొగాకు కిలో సగటు ధర రూ.237.44 లభించిందన్నారు. మరో నెల రోజులు కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని, రైతుల వద్ద దాదాపు 12 మిలియన్ల కిలోల పొగాకు అమ్మకానికి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 164 రోజుల పాటు వేలం ప్రక్రియ జరిగిందన్నారు.

రైతులు స్వీయ

నియంత్రణ పాటించాలి

రైతులు పొగాకు సాగులో స్వీయ నియంత్రణ పాటించాలి. పరిమితికి లోబడి మాత్రమే వచ్చే ఏడాదికి పండించాలి. బోర్డు నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌ లేకుండా పొగాకు సాగు చేయవద్దు. రిజిస్ట్రేషన్‌ లేకుండా నిర్మించిన బ్యారన్లను తొలగించాలి. అటువంటి బ్యారన్లలో పొగాకు క్యూరింగ్‌ చేయబోమని బోర్డుకు రైతు అఫిడవిట్‌ ఇవ్వాలి. అఫిడవిట్‌ ఇచ్చిన తర్వాత బ్యారన్‌ వినియోగిస్తే పొగాకు అమ్మకాలను నిలుపు చేస్తాం. లో గ్రేడ్‌ పొగాకు కొనుగోళ్లు మందకొడిగా ఉన్నాయి. కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు. లో గ్రేడ్‌ పొగాకు గ్రేడింగ్‌ సరిగా లేదు. మిక్సింగ్‌ గ్రేడ్‌లు ఉన్నందున ధర పలకడం లేదు.

– జీఎల్‌కే ప్రసాద్‌, పొగాకు బోర్డ్‌ రీజినల్‌ మేనేజర్‌,

రాజమహేంద్రవరం

ఫ మందకొడిగా

లో గ్రేడ్‌ పొగాకు అమ్మకాలు

ఫ 4 మిలియన్‌ కిలోల ఉత్పత్తి అంచనా

ఫ కొనుగోలుకు ఆసక్తి చూపని వ్యాపారులు

ఫ కిలో ధర రూ.70

ఫ అయోమయంలో రైతులు

లో గ్రేడ్‌.. వెరీ బ్యాడ్‌1
1/2

లో గ్రేడ్‌.. వెరీ బ్యాడ్‌

లో గ్రేడ్‌.. వెరీ బ్యాడ్‌2
2/2

లో గ్రేడ్‌.. వెరీ బ్యాడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement