
వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటాలి
అంబాజీపేట: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ అన్నారు. అంబాజీపేట మండలం నందంపూడిలో వడ్లమాని లక్ష్మీనారాయణ అవధాని స్మృత్యర్థం ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య ఘనపాఠి ఆధ్వర్యాన వడ్లమాని లక్ష్మీనారాయణ మెమోరియల్ ట్రస్ట్ పేరిట మంగళవారం వేద సభ నిర్వహించారు. మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంస్కృతీ సంప్రదాయాలకు భారతదేశం, కోనసీమ వేద పండితులకు పుట్టినిల్లని అన్నారు. వేద పండితులకు ఎన్నో ఆర్థిక సమస్యలున్నాయని, అయినప్పటికీ వేదాల ప్రాశస్త్యాన్ని, అర్థాలను సమాజానికి చాటి చెబుతున్నారని అన్నారు. ఇలాంటి వేదసభలు గ్రామ స్థాయిలో కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తే వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పడంతో పాటు వేదాలకు, వేద పండితులకు ఎంతో గుర్తింపు లభించి, వారి ఆర్థిక సమస్యలు తీరుతాయని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ సమక్షంలో వేద పండితులు సుమారు గంటసేపు వేదస్వస్థి గావించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. తొలుత సుబ్రహ్మణ్య ఘనపాఠి ఆధ్వర్యాన వేద పండితులు జస్టిస్ రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీటీడీ ఆస్థాన వేద పండితులు ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి ఘనపాఠి, టీటీడీ దేవస్థానం శ్రీ వెంకటేశ్వర హయ్యర్ వేదిక్ స్టడీస్ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ దువ్వూరి ఫణి యజ్ఙేశ్వరయాజులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పీకే రావు, పేరి శ్రీనివాస్, అధిక సంఖ్యలో వేద పండితులు పాల్గొన్నారు.
నా జన్మ ధన్యం
ఈ సందర్భంగా జస్టిస్ రమణ కొద్దిసేపు సుబ్రహ్మణ్య ఘనపాఠితో ముచ్చటించారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య ఘనపాఠితో తీయించుకున్న ఫొటో లను ఆయన నివాసంలో చూసి, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. వెంకటేశ్వరస్వామి దయ వల్లే తాను తన పదవిని ఎంతో సమర్థంగా నిర్వహించానని, భగవంతుని ఆశీస్సులతో పాటు వేద పండితుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అన్నారు. చిన్నతనం నుంచీ వేదపండితుల మధ్య కూర్చొని వేద ఘోషను ఆస్వాదించాలనే తన జీవిత కాల కోరిక నెరవేరిందని తన్మయత్వానికి లోనయ్యారు. వేదపఠనాన్ని ఆస్వాదిస్తూ, ఎంతో పులకించిపోయానని, మానసికంగా ఎన్నడూ పొందని ఆనందాన్ని పొందానని అన్నారు. లక్ష్మీనారాయణ అవధాని మెమోరియల్ ట్రస్టుకు రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని మనుమడు, ప్రముఖ వేద పండితుడు ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్య రవితేజ ఘనపాఠికి జస్టిస్ రమణ సింహతలాటం అలంకరించి సత్కరించారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ