
గరుడ వాహనంపై మలయప్ప దర్శనం
● ఘనంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు
● స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు
కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలో భూసమేత వేంకటేశ్వరస్వామివారి వార్షిక దివ్య బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఐదో రోజు మంగళవారం శ్రీవారు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించారు. దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, వాహనసేవ, ఊరేగింపులు జరిపారు.
గరుడ వాహనంపై శ్రీవారు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్శంగా పండితులు గరుడ వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. కాగా..ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గరుడ వాహనంపై మలయప్ప దర్శనం