
అపశ్రుతులు అందుకేనా..?
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఎనిమిది నెలలుగా వివాదాల నడుమ వార్తల్లో నిలుస్తోంది. మూడు నెలలుగా పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూడేళ్లుగా ఎటువంటి యాగాలు, కోటి తులసి పూజలు జరగకపోవడం, భక్తుని మృతి తర్వాత కూడా సంప్రోక్షణ పూజలు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయం పండిత వర్గాల్లో వ్యక్తమవుతోంది.
వైష్ణవాలయాల్లో పవిత్రోత్సవాల పేరిట..
సత్యదేవుని సన్నిధికి నిత్యం వేలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. వీరిలో కొందరు భక్తులు తెలిసో తెలియకో అశౌచం, ఇతర రాకూడని పరిస్థితుల్లో స్వామివారి సన్నిధికి వస్తుంటారు. ఇది అన్ని దేవస్థానాల్లో జరిగేదే. వైష్ణవాలయాల్లో పవిత్రోత్సవాల పేరుతో ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు ప్రత్యేక పూజలు చేసి, ఆలయాన్ని శుద్ధి చేస్తుంటారు. తిరుమల తిరుమతి దేవస్థానం, సింహాచలం, ద్వారకా తిరుమల దేవస్థానాల్లో బ్రహ్మోత్సవాలకు ముంందు ఇటువంటి పూజలు చేస్తుంటారు. దీంతో ఆయా దేవస్థానాల్లో దుస్సంఘటల వల్ల ఏర్పడిన ప్రభావం పోయి మరలా పవిత్రత చేకూరుతుందనే నమ్మకం ఉంది.
గతంలో యాగాలు, సంప్రోక్షణలు
అన్నవరం దేవస్థానంలో కూడా గతంలో రెండేళ్లకోసారి మహానారాయణ యాగం, కోటి తులసి పూజలు నిర్వహించేవారు. చివరగా 2022 ఫిబ్రవరిలో సత్యదేవుని సన్నిధిన పది రోజులు కోటి తులసి పూజ నిర్వహించారు. దేవస్థానంలో భక్తుడు మరణిస్తే వెంటనే సంప్రోక్షణ పూజలు చేసేవారు. మృతదేహాన్ని తరలించిన మార్గంలో కొండ దిగువ వరకూ సంప్రోక్షణ చేసేవారు. దీంతో తిరిగి పవిత్రత నెలకొంటుందనే భావన ఉండేది. కొన్నాళ్లుగా దేవస్థానంలో ఇటువంటి యాగాలు, సంప్రోక్షణ పూజలు జరగలేదు.
రెండు నెలల్లో దుస్సంఘటనలు
● రెండు నెలల క్రితం దేవస్థానంలోని సిక్స్ వీఐపీ సత్రంలో బస చేసిన భక్తుడు అపస్మారక స్థితిలో ఉండగా, కొండ దిగువన దేవస్థానం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కొండపైనే అతడు మృతి చెందాడని, ఉద్దేశపూర్వకంగా కొండదిగువన చనిపోయినట్టు ప్రకటించారని తర్వాత వెల్లడైంది.
● ఆగస్టు ఒకటో తేదీన దేవస్థానంలోని స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, హుటాహుటిన తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నవరం వచ్చి పరిస్థితిని సమీక్షించాల్సి వచ్చింది.
● ఆగస్టు ఆరో తేదీన ప్రకాష్ సదన్ సత్రం వద్ద పార్కింగ్‌లో ఉంచిన సీఎన్‌జీ కారు దగ్ధమైంది. ఆ కారుతో పాటు పక్కనున్న మరో రెండు కార్లూ పాక్షికంగా దెబ్బతిన్నాయి.
● గత నెల 27వ తేదీన పశ్చిమ రాజగోపురం వద్ద ఫాన్సీ షాపు గోడౌన్‌లో అగ్నిప్రమాదం జరిగి రూ.పది లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. దేవస్థానం సెక్యూరిటీ అధికారులు సకాలంలో స్పందించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే మరిన్ని దుకాణాలకు మంటలు వ్యాపించి, ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉండేది.
● ఈ నెల మూడో తేదీ రాత్రి విష్ణుసదన్ సత్రంలో మూడో అంతస్తు నుంచి తల్లీకుమారుడు కిందపడ్డారు. తల్లికి రెండు కాళ్లు విరగగా, కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. కుమారుడికి స్పల్ప గాయాలయ్యాయి.
● ఇవే కాకుండా కొద్ది నెలలుగా అధికారుల వ్యవహార శైలి కారణంగా దేవస్థానం తరచూ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే.
ఈ నెల 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతుండగా, నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేస్తుంటారు. తెల్లవారుజామున రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. కార్తిక పౌర్ణిమ నాడు జరిగే గిరి ప్రదక్షిణలో మూడు లక్షలు మంది భక్తులు పాల్గొంటారు. అదే రోజు స్వామివారి ఆలయానికి లక్ష మంది వరకు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో కార్తిక మాసానికి ముందే దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు చేయిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పండితులతో చర్చిస్తాం
దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు జరిపించే విషయమై దేవస్థానం పండితులతో చర్చిస్తాం. అవసరమనుకుంటే కార్తిక మాసం కన్నా ముందుగానే చేయిస్తాం.
– ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం
రత్నగిరిపై వరుస దుస్సంఘటనలపై
అనుమానాలు
ఎనిమిది నెలలుగా
దేవస్థానంలో పలు వివాదాలు
మూడు నెలలుగా ప్రమాద ఘటనలు
గతంలో రెండేళ్లకోసారి నారాయణ యాగం, కోటి తులసి పూజలు
భక్తుడు మరణిస్తే సంప్రోక్షణ
ఇప్పుడు అవి లేకనే
దుష్ప్రభావాలంటూ అభిప్రాయాలు

అపశ్రుతులు అందుకేనా..?

అపశ్రుతులు అందుకేనా..?