
పొగాకు నాట్లు ప్రారంభం
పరిమితికి మించి
పంట వేయవద్దు
పొగాకు బోర్డు ఇచ్చిన పరిమితికి లోబడి పంట వేయాలి. బ్యారన్‌కు 1.6 హెక్టార్ల విస్తీర్ణంలో పంట వేసి 35 క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలి. అధిక విస్తీర్ణంలో పంట సాగు అనర్థదాయకమే. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి. వరి పంట వేసిన బాడవ భూములు, పల్లపు ప్రాంత భూముల్లో సాగు చేయవద్దు. నారుమడిలో మేలైన నారును ఎంచుకుని నాట్లు వేసుకోవాలి. రిజిస్ట్రేషన్ గల నర్సరీల నుంచి నారు కొనుగోలు చేయాలి. అప్పర్ ఎన్‌ఎల్‌ఎస్‌లో నాట్లు జరుగుతున్నాయి. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో రెండు రోజులుగా నాట్లు వేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు ట్రే నారు నాట్లు వేస్తున్నారు.
– జీఎల్‌కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరం
దేవరపల్లి: మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా పండిస్తున్న వర్జీనియా పొగాకు సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. 2025–26 పంట కాలానికి రైతులు పొగాకు నాట్లు ప్రారంభించారు. వారం రోజులుగా నాట్లు వేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోని ఎర్రమట్టి ఇసుక నేలలు, నల్లరేగడి భూముల్లో పొగాకు సాగు జరుగుతుంది. ఉత్తర తేలిక నేలల్లో(ఎన్‌ఎల్‌ఎస్) పండిస్తున్న పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, ఏలూరు జిల్లాల్లో ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు సాగు జరుగుతుంది. ఈ పొగాకుకు ఎగుమతి ఆర్డర్లు ఉండడంతో మంచి ధర పలుకుతుంది. రెండేళ్లుగా పొగాకు పంట రైతులకు కాసులు కురిపిస్తోంది. ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట ఎన్‌ఎల్‌ఎస్ సాగు. ఎకరాకు దాదాపు రూ.3 లక్షలు పెట్టుబడి అవుతుంది. నవంబర్ నెలాఖరుకు పొగాకు నాట్లు పూర్తికానున్నాయి. ఈ నెల 15 తర్వాత నాట్లు ముమ్మరంగా జరుగుతాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతాన్ని అప్పర్ ఎన్‌ఎల్‌ఎస్, లోయర్ ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతాలుగా పిలుస్తారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను అప్పర్ ఎన్‌ఎల్‌ఎస్, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను లోయర్ ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంగా పిలుస్తారు. ఏటా అప్పర్ ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో ముందస్తు సాగు ప్రారంభిస్తారు. అక్టోబర్ మొదటి వారంలో అక్కడ నాట్లు వేయగా, 20 రోజుల తేడాలో లోయర్ ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో సాగు ప్రారంభిస్తారు. ప్రస్తుతం అప్పర్ ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో ముమ్మరంగా నాట్లు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.
పెరిగిన సాగు
రెండు జిల్లాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో రైతులు పొగాకు పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది బోర్డు లెక్కల ప్రకారం 29,480 హెక్టార్లలో పంట సాగు చేశారు. బోర్డు అనుమతి లేకుండా మరొక నాలుగు వేల హెక్టార్లలో సాగు చేసినట్టు సమాచారం. రాజమహేంద్రవరం రీజనల్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1,2 వేలం కేంద్రాల పరిధిలో 14,754 మంది రైతులు 12,723 బ్యారన్లు కలిగి ఉన్నారు.
అధిక దిగుబడుల వంగడాల సాగు
అధిక దిగుబడులు వస్తున్న వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. సీటీఆర్‌ఐ, ఐటీసీ సంస్థల నుంచి వంగడాలను రైతులు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. ఎల్‌వీ–7, 1353 వంగడాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్లు దిగుబడి నిస్తున్నాయి. కిలో విత్తనం రూ.25 వేలకు కొనుగోలు చేస్తున్నారు.
అంతరించిపోతున్న
జీడిమామిడి పంట
జీడిమామిడి పంట మెట్ట ప్రాంతంలో అంతరించిపోతోంది. మార్కెట్లో పొగాకు ధర లాభసాటిగా ఉండడం, కౌలు ఎక్కువగా రావడంతో రైతులు జీడిమామిడి తోటలను తొలగించి పొగాకు సాగు చేస్తున్నారు. జీడిమామిడి పంట దిగుబడి తగ్గడంతో పాటు ధర లేకపోవడంతో గిట్టుబాటు కావడంలేదని రైతులు అంటున్నారు.
దేవరపల్లి మండలం సంగాయగూడెంలో పొగాకు నాట్లు వేస్తున్న కూలీలు
నాటడానికి మడుల్లో సిద్ధంగా ఉన్న పొగాకు నారు
80 వేల ఎకరాల్లో పంట సాగు
14,754 మంది రైతులు
12,723 బ్యారన్లు
ఆసక్తి చూపుతున్న కౌలురైతులు
లాభసాటిగా పొగాకు సాగు
గణనీయంగా
పెరగనున్న సాగు విస్తీర్ణం
కౌలు రైతుల మధ్య పోటీ
రెండేళ్లుగా పొగాకు సాగు లాభసాటిగా ఉంది. కిలో రూ.430 ధర పలకడంతో కౌలుదారులు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కౌలుదారుల మధ్య పోటీ ఏర్పడంతో భూమి కౌలు ఎకరం రూ.80 వేల నుంచి రూ.1 లక్ష పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి కౌలు పలుకుతుంది. బ్యారన్ లీజు రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షలు పలుకుతుంది. బ్యారన్ లైసెన్స్ ఖరీదు రూ.10.50 లక్షలు పలుకుతుంది. మూడేళ్ల క్రితం బ్యారన్ ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఉండగా, గత ఏడాది రూ.8 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.10.50 లక్షలు పలుకుతుండడంతో ఎక్కువ బ్యారన్లు ఉన్న రైతులు కొన్ని బ్యారన్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

పొగాకు నాట్లు ప్రారంభం

పొగాకు నాట్లు ప్రారంభం

పొగాకు నాట్లు ప్రారంభం