
మృతదేహాల అప్పగింత
రాయవరం: గ్రామ పరిధిలో బుధవారం జరిగిన బాణసంచా దుర్ఘటనలో మృతదేహాలను బాధిత కుటుంబాలకు గురువారం పోలీసులు అప్పగించారు. ఆరు మృతదేహాలకు రామచంద్రపురం, రెండు మృతదేహాలకు కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ దుర్ఘటనలో బాణసంచా యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి(సత్తిబాబు)తో సహా ఏడుగురు కూలీలు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు తెలిపారు.
కుటుంబానికి ఆధారం కోల్పోయాం
కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాసంశెట్టి విజయలక్ష్మి(51) మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన విజయలక్ష్మి పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి కూలి పని నిమిత్తం వస్తోంది. ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూలి పనికి వచ్చిన విజయలక్ష్మి దుర్ఘటనలో తీవ్రగాయాల పాలైంది. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది. ఇదిలా ఉంటే కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న విజయలక్ష్మి మృతితో కుటుంబం ఆధారం కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసుకుని ఇంటికి వస్తుందని ఆశించామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
అంత్యక్రియలు పూర్తి
అనపర్తి : శ్రీగణపతి గ్రాండ్ ఫైర్‌వర్క్స్‌లో జరిగిన విస్ఫోటంలో మృతిచెందినవారి అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ ప్రమాదంలో అనపర్తి శివారు సావరానికి చెందిన కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, చిట్టూరి శ్యామల ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వారి మృతదేహాలకు స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.