
చెరువు నీటిలో విష అవశేషాలు
తాళ్లపూడి: పెద్దేవం చెరువు నీటిలో విష అవశేషాలు ఉన్నట్టు గుర్తించామని, రైతులు తమ పశువులకు ఇన్సూరెన్స్ చేసుకుంటే నష్టాన్ని నివారించవచ్చునని పశు సంవర్ధక శాఖ డీడీ డాక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండలంలోని పెద్దేవం గ్రామంలో కొద్దిరోజులుగా అనారోగ్యంతో మృత్యువాత పడుతున్న గేదెల జబ్బును గుర్తించేందుకు వీలుగా ఆయన ఆధ్వర్యంలో బృందం పర్యటించి గేదెల పేడ, మూత్రం పరీక్షలు చేయించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా 50 మందికి పైగా రైతుల హాజరై తమ గేదెల పేడ పరీక్షలు చేయగా 90 శాతం గేదెలలో జలగ వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు పశు సంవర్ధక శాఖ డీడీ పేర్కొన్నారు. డీడీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా గేదెలకు ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకం అమలులో లేనందున ప్రైవేట్ కంపెనీ ఇన్సూరెన్‌్స్ అయినా సరే తీసుకుంటే నష్ట నివారణకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులను రైతులకు పరిచయం చేశారు. మృత్యువాత పడ్డ ఒక గేదెకు పోస్ట్‌మార్టం నిర్వహించి, జరిపిన పరీక్షల్లో రెండు వైరస్‌లు గుర్తించినట్లు, చెరువు నీటిలో పేరాకాట్ పోయిజినింగ్ అవశేషాలు ఉన్నట్లు తేలిందని, అవి ప్రమాదకరమని, గేదెలలో వ్యాధి నిరోధక శక్తి నశించి, మిగతా వైరల్ రోగాల పెరుగుదలకు అవకాశం ఇస్తోందని అన్నారు.
నష్ట పరిహారం ఇవ్వాల్సిందే
గ్రామ ఉప సర్పంచ్ తోట రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు పేరాకాట్ పాయిజన్ పొలాల్లో వాడతారని దీనివల్ల గేదెలకు రోగాలు వచ్చాయనటం ఆశ్చర్యంగా ఉందని, గేదెలకు వచ్చిన రోగాన్ని నిర్ధారణ చేసి సరైన మందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువులో నీరు తాగని గేదెలకు కూడా వ్యాధి వచ్చిందని దానికి సమాధానం చెప్పాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ డాక్టర్లు చేస్తున్న వైద్యం తమ గ్రామంలో రైతులకు సంతృప్తిగా లేదని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా గేదెలు నష్టపోయినవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ఎ.వెంకటరెడ్డి, కాకినాడ ల్యాబ్‌కు చెందిన డాక్టర్ సందీప్, డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు, తాళ్లపూడి మండల పశువైద్యాధికారులు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ బాలాజీ పాల్గొన్నారు.