
పరిహారం.. పరిహాసం
● బాణసంచా పేలుడు బాధితులకు సాయం ప్రకటించని కూటమి ప్రభుత్వం
● తీరిగ్గా ఇప్పుడు తనిఖీలు ప్రారంభించిన జిల్లా యంత్రాంగం
సాక్షి, అమలాపురం/ రాయవరం: రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటం జరిగి నిరుపేద కూలీలు మృత్యువాత పడినా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం ప్రకటించలేదు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మి క శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్, హోం శాఖమంత్రి వంగలపూడి అనితతోపాటు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పరిహారంపై స్పష్టత లేదు. ఇటువంటి చోట పనిచేసేవారికి అటు యాజమాన్యం, ఇటు కార్మిక శాఖలు కలిసి ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉంది. కాని చనిపోయిన వారి వివరాలు కూడా కార్మిక శాఖకు వెంటనే తెలియని దుస్థితి. మృతులు కార్మికశాఖ రికార్డుల్లో నమోదు కానట్టు తెలిసింది. ‘ఎంప్లాయిస్ కాంపన్సేషన్ యాక్టు’ ప్రకారం యజమానుల వద్ద నుంచి పరిహారం కోరతామని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు.
చేతులు కాలాక హడావుడి
బాణసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటంతో తీవ్ర విషాదం నెలకొనడంతో జిల్లా యంత్రాంగం ఇప్పుడు హడావుడి చేస్తోంది. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ జిల్లాలోని అన్ని శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న బాణసంచా తయారీ యూనిట్లు, హోల్‌సేల్ విక్రయ కేంద్రాల లైసెన్స్‌లను, భద్రత, రక్షణ ప్రమాణాల అంశాలను మూడు రోజులపాటు పర్యవేక్షణ బృందాలు తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కేంద్రాలలో పనిచేసే కార్మికులకు నైపుణ్యం ఉన్నదీ లేనిదీ చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ యూనిట్లు 18 వరకు ఉన్నాయని, హోల్‌సేల్ డీలర్లు 19 మంది వరకు ఉన్నారన్నారు. ప్రతి కార్మికునికి బీమా చేయిస్తున్నదీ లేనిదీ చూడాలన్నారు. కలెక్టర్ ఆదేశాలతో తయారీ, విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. బాణసంచా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పార్టీ సభ్యులతో కలిసి గురువారం పరిశీలించారు.