
వరాల వెంకన్నకు బ్రహ్మోత్సవం
అన్ని ఏర్పాట్లు చేశాం
● రేపటి నుంచి
వాడపల్లి క్షేత్రంలో ప్రారంభం
● రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనం
● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
కొత్తపేట: ‘ఏడు వారాల వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలం’ నానుడితో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం వాడపల్లిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. దేవదాయ, ధర్మదాయ శాఖ, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. అటు రావులపాలెం, ఇటు బొబ్బర్లంక నుంచి స్వాగత ద్వారాలు, అక్కడి నుంచి ఆలయం వరకు విద్యుద్దీపాలంకరణలు చేశారు.
1759లో ఆలయ నిర్మాణం
స్వామివారి ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే వ్యాపారి 1759వ సంవత్సరంలో నిర్మించారు. ఆయన స్నేహితుడు, ప్రాంతీయ పరిపాలకుడైన పెద్దాపురం మహరాజు రాజా వత్సవాయి తిమ్మ జగపతిరాజు ఈ ఆలయ నిర్వహణకు 275 ఎకారాలను విరాళంగా సమకూర్చారు. దీప ధూప నైవేద్యాల కోసం 110 ఎకరాలు, స్వామి వారి సేవల నిమిత్తం 165 ఎకరాల భూమి సమర్పించారు.
అంతకంతకూ పెరుగుతున్న భక్తజనం..
పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి తరువాత అత్యంత భక్తజనాదరణ పొందిన క్షేత్రంగా వాడపల్లి విలసిల్లుతోంది. గౌతమీ–వశిష్ట గోదావరుల నడుమ, గౌతమీ నదికి అతి సమీపంలోని ఈ క్షేత్రానికి కొద్ది దూరంలోనే విజ్జేశ్వరం, లొల్ల గ్రామానికి ఆనుకొని ఉండటంతో ఈ గ్రామాన్ని లొల్ల వాడపల్లి, చిన్న వాడపల్లిగా పిలుస్తారు. ఇక్కడ నిత్యం తిరుమల తరహాలో సుప్రభాత, నిత్య కల్యాణ సేవలు నిర్వహిస్తారు. ఏడు శనివారాల పాటు, ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు చెల్లించి, మరో వారం అష్టోత్తర పూజ చేయిస్తే సంకల్పాలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ ప్రాశస్త్యం మేరకు పదేళ్ల కాలంలో స్వామివారి ఖ్యాతి గణనీయంగా పెరిగి ప్రతి శనివారం సుమారు రూ.55 లక్షలకు పైబడి, నిత్యం రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షలు వరకు ఆదాయం వస్తుండగా, ప్రతి నెలా హుండీల ద్వారా సుమారు రూ 1.35 కోట్లు పైబడి ఆదాయం సమకూరుతోంది. దానితో ఆలయం డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరింది.
వైఎస్సార్ సీపీ హయాం నుంచీ..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కృషి, దాతల సహకారంతో సుమారు రూ.65 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అవరణలో గోశాల, భారీ రేకుషెడ్లు, అన్నదాన భవనం నిర్మాణం, వకుళమాత అన్న ప్రసాద భవనం, స్వామి వారి తెప్పోత్సవం నిర్వహణకు కోనేరు ఏర్పాటుకు శ్రీకారం. కాలినడకన వచ్చే భక్తులకు విశ్రాంతి, సామూహిక వివాహాలు, ఉపనయనాలు జరిపేందుకు వీలుగా మూడు అంతస్తుల భవనం నిర్మాణం, స్వామి వారికి శాశ్వత వార్షిక కల్యాణ వేదిక, వాటర్ ప్లాంట్, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఏర్పాటుచేశారు.
ప్రత్యేక అలంకారాలు, వాహన సేవలు
స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పదో తేదీన పరావసుదేవి అలంకరణలో శేషవాహనంపైనా, 11న సరస్వతిగా, హంసవాహనంపైనా, 12న కోదండరామునిగా హనుమద్వాహనంపైనా, 13న యోగనారసింహునిగా సింహ వాహనంపైనా, 14న మలయప్పస్వామిగా గరుడునిపైనా, 15న శ్రీకృష్ణునిగా ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి మోహినీదేవిగా చంద్రప్రభవాహనంపై, 16న రాజాధిరాజుగా గజవాహనంపై, 17న కల్కిగా ఉదయం కల్పవృక్షవాహనంపై, రాత్రి అశ్వవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 18న స్వామివారికి చక్రస్నానం నిర్వహించనున్నారు.
జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో..
ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పర్యవేక్షణలో దేవాదాయ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ఆర్‌టీసీ అదనపు బస్సులు
ప్రతి శనివారం రావులపాలెం డిపో నుంచి 12 బస్సులు, మిగిలిన రోజుల్లో అదనంగా మూడు బస్సులు చొప్పున, అలాగే ఉమ్మడి జిల్లాలో ఇతర డిపోల నుంచి అదనపు బస్సులు నడుతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేసినట్టు రావులపాలెం డీఎం వైవీవీఎన్ కుమార్ తెలిపారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేశాం. అందరూ సహకరించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం.
– నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ ఈఓ, వాడపల్లి

వరాల వెంకన్నకు బ్రహ్మోత్సవం

వరాల వెంకన్నకు బ్రహ్మోత్సవం