సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వరుదు కల్యాణి స్వామివారికి పూజలు చేశారు. తొలుత ఆలయం వద్ద వారికి ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు పి.రామశేషాచార్యులు, ఎస్‌బీఎం రమేష్ స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ సూపరింటెండెంట్ పి.విజయ సారథి వారికి స్వామివారి చిత్రపటాలను, లడ్డు ప్రసాదాలను అందజేశారు. ఎంపీపీ వీరా మల్లిబాబు పాల్గొన్నారు.
హుండీలో మంగళ సూత్రాలు
అమలాపురం టౌన్: దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక రవణం వీధిలోని మహిషాసుర మర్దినిదేవి ఆలయంలో హుండీని ఆలయ కమిటీ, ఆ వీధి ఉత్సవ కమిటీ ప్రతినిధులు బుధవారం తెరిచి లెక్కించారు. ఈ సమయంలో కరెన్సీ నోట్లు, చిల్లర నాణేలతో పాటు బంగారు మంగళ సూత్రాలు గమనించారు. మొక్కు చెల్లింపులో భాగంగా అజ్ఞాత భక్తురాలు హుండీలో తాళి బొట్టు వేసి ఉంటుందని భావిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యుడు చిక్కం కిట్టు తెలిపారు. దసరా శరన్నవ రాత్ర ఉత్సవాల సమయంలో అమ్మ వారి హుండీలో రూ.82 వేల నగదు వచ్చిందని కమిటీ తెలిపింది.