నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని కప్పుల పూజిత (17) మృతదేహం బుధవారం మోర్త సరిహద్దు ప్రాంతంలో లభ్యమైంది. 24 గంటల పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. పూజిత మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వేలివెన్ను ఓ ప్రైవేట్ కళాశాలలో పూజిత ఇంటర్ చుదువుతోంది. మంగళవారం విద్యార్థులతో కలిసి బస్సులో ఇంటికి బయలుదేరింది. దమ్మెన్ను వంతెన వద్దకు రాగానే తనకు వాంతులు వస్తున్నాయని బస్సు ఆపమని కిందకు దిగింది. పూజిత వెంటనే వంతెన దగ్గర చెప్పులు విడిచిపెట్టి కాలువలో దూకేసింది. దీంతో బస్సు డ్రైవర్, సహచర విద్యార్థులు పెద్దగా అరవడంతో స్థానికులు స్పందించి కాలువలో గాలించారు. ఉండ్రాజవరం ఎస్సై డి.రవికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలికి చేసుకుని విచారణ చేపట్టారు. ఎన్‌డీఎఫ్ బృందాలు కాలువలో గాలించగా చివరకు పూజిత మృతదేహం లభ్యమైంది. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఉండ్రాజవరం ఎస్సై డి. రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.