
అటికే సత్యవతి (ఫైల్)
భర్తకు తీవ్రగాయాలు
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుండి వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని శరభవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అటికే సత్యవతి (58), ఆమె భర్త, మాజీ పంచాయతీ వార్డు సభ్యుడు అటికే సత్యనారాయణలు బైక్‌పై టి రాయవరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా స్థానిక పెట్రోల్ బంకు సమీపానికి వచ్చేసరికి తుని వైపు వెళ్తున్న వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో సత్యవతి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సత్యనారాయణకు స్థానిక సీహెచ్‌సీలో ప్రాధమిక చికిత్స అనంతరం కాకినాడ తరలించారు. సత్యవతికి ముగ్గురు కుమారులున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.